కలం, వెబ్ డెస్క్: సీతమ్మ సాగర్ ప్రాజెక్టు ఎన్విరాన్‌మెంటల్ క్లియరెన్స్ వీలైనంత త్వరగా లభించేలా కేంద్రంతో సంప్రదింపులు జరుపుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) తెలిపారు. సెక్రటేరియట్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డితో ఆయన ప్రత్యేకంగా సమావేశమై చర్చించారు. సీతారామ ఎత్తిపోతల పథకం (Sitarama Project Works)తోపాటు సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ఎన్విరాన్‌మెంటల్, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ అనుసరిస్తున్న కార్యాచరణ విధానానికి సంబంధించిన అంశం సుప్రీంకోర్టు పరిధిలో పెండింగ్‌లో ఉండటంతో మార్చి 2023 నుంచి ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయన్నారు. ఈ చిక్కులు వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు.
ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ తో సమన్వయంతో పనిచేస్తున్నామని అన్నారు. కేంద్ర మంత్రులు, శాఖలు, అధికారుల వద్ద అన్ని విధాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తామని వివరించారు. అనుమతులు లభించిన వెంటనే పెండింగ్ పనులు పునఃప్రారంభిస్తామని చెప్పారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల రైతాంగానికి సాగునీటి ప్రయోజనాలు త్వరితగతిన అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
సీతారామ ఎత్తిపోతల పథకంలో పంప్‌హౌస్-1, పంప్‌హౌస్-2 మధ్య ఉన్న దోమలవాగుపై ప్రస్తుతం ఉన్న 0.20 టీఎంసీల నిల్వ సామర్థ్యాన్ని 0.50 టీఎంసీలకు పెంచే ప్రతిపాదనపై ఉత్తమ్ కుమార్‌రెడ్డి (Uttam Kumar Reddy)తో చర్చించినట్లు తుమ్మల తెలిపారు. నిల్వ సామర్థ్యం పెరిగితే ఎత్తిపోతల పథకం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని అన్నారు. రెండు పంప్‌హౌస్‌ల మధ్య నీటి లభ్యత స్థిరంగా ఉంటుందని చెప్పారు. ఈ ప్రతిపాదనకు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ సానుకూలంగా స్పందించారని అన్నారు. సీతారామ ప్రధాన కాలువపై పంప్‌హౌస్-1, 2, 3 మధ్య అవసరమైన చోట్ల ఎస్కేప్ రెగ్యులేటర్ల ఏర్పాటు అంశంపైనా విస్తృతంగా చర్చించినట్లు తుమ్మల వివరించారు.

