కలం, వెబ్ డెస్క్: కేరళ, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) ప్రచారం ముగిసింది. ప్రచారం ముగియడంతో మైకులు మూగబోయాయి. అన్ని పార్టీలూ చివరి నిమిషం వరకు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశాయి. కేరళ ఎన్నికలు ఈ సారి ప్రతిష్ఠాత్మకంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు పార్టీలు జోరుగా ప్రచారం చేపట్టాయి. ప్రధాని నరేంద్రమోడీ, ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ నేరుగా రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ప్రచారం చేపట్టారు.
ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య హోరాహోరీ
కేరళలో ఎల్డీఎఫ్-యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొన్నది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఎల్డీఎఫ్ (వామపక్ష కూటమి), యూడీఎఫ్ (కాంగ్రెస్ నేతృత్వ కూటమి) మధ్య పోటీ నెలకొంది. బీజేపీ సైతం ఈ రాష్ట్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ముఖ్యమంత్రి పినరయి విజయన్, ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ పోటాపోటీగా ప్రచారం నిర్వహించారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నేతలు రంగంలోకి దిగి ప్రచారం చేశారు. కాంగ్రెస్ కూటమి ఐదు గ్యారెంటీలతో ప్రజల్లోకి వెళ్లింది. సంక్షేమ హామీలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ఇక హిందూ ఓటు బ్యాంక్ కూడా ఈసారి కీలకంగా మారినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటముల మధ్య ఓట్లు చీలితే తమకు రాజకీయంగా లాభం కలుగుతుందని బీజేపీ భావిస్తోంది.
అసోంలో వాడీవేడిగా ప్రచారం
అసోంలో కూడా ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగింది. అధికార పార్టీ బీజేపీ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, శాంతి భద్రతలను ప్రధాన అంశాలుగా ప్రస్తావించింది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగం, ధరల పెరుగుదల, రైతు సమస్యలను ఎత్తిచూపుతూ ప్రచారం చేపట్టింది. ప్రాంతీయ అంశాలు, జాతి, మత సమీకరణాలు అసోం ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రత్యేకంగా అసోంలో సరిహద్దు భద్రత, వలసల సమస్య, పౌరసత్వ సవరణ చట్టం (CAA) ప్రభావం వంటి అంశాలు ఓటర్ల నిర్ణయంపై ప్రభావం చూపే అవకాశముంది. పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి అంశాలు, గ్రామీణ ప్రాంతాల్లో జీవనోపాధి సమస్యలు ప్రధాన చర్చాంశాలుగా నిలిచాయి.
పుదుచ్చేరిలో కూటముల మధ్య పోటీ
పుదుచ్చేరిలో కూడా ఎన్నికల వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది. ఇక్కడ ప్రధానంగా ఎన్డీఏ కూటమి మరియు కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి మధ్య పోటీ నెలకొంది. ప్రాంతీయ సమస్యలు, పర్యాటక అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, కేంద్ర-రాష్ట్ర సంబంధాలు వంటి అంశాలు కీలకంగా మారాయి. చిన్న రాష్ట్రం కావడంతో స్థానిక నాయకుల ప్రభావం కూడా గణనీయంగా ఉంటుంది. మూడు రాష్ట్రాల్లో ప్రచారం ముగియడంతో ఇప్పుడు ఓటర్ల తీర్పుపైనే అందరి దృష్టి నిలిచింది. కేరళలో ఎల్డీఎఫ్ తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా? యూడీఎఫ్ అధికారంలోకి వస్తుందా? అసోంలో బీజేపీ తన స్థానం నిలబెట్టుకుంటుందా? పుదుచ్చేరిలో ఏ కూటమి పైచేయి సాధిస్తుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also: శ్రేయాన్ష్ ప్రపంచ రికార్డు సాధించడం రాష్ట్రానికి గర్వకారణం: కొండా సురేఖ
Follow Us On: X(Twitter)

