epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

టార్గెట్ పెద్దిరెడ్డి?

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ కూటమి వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy)ని టార్గెట్ చేసుకుందా? వైఎస్సార్ సీపీలో జగన్ తర్వాత ఎక్కువ ప్రాముఖ్యం ఉన్న పెద్దిరెడ్డి ఫ్యామిలీపై గురి పెట్టిందా? ఇప్పటికే లిక్కర్ కేసులో పెద్దిరెడ్డి కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డిని జైలుకు పంపిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా పెద్దిరెడ్డిని సైతం కటకటాల పాలు చేసేందుకు చూస్తోందా? దీనికి జనసేన అధినేతను టీడీపీ పావులా వాడుకుంటోందా? నెల తిరగక ముందే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి చిత్తూరు జిల్లా పర్యటనకు వెళుతుండడం వెనక మర్మం ఇదేనా? పరిస్థితులు చూస్తే అలాగే కనిపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

కనిపించని కోణం..:

సాధారణంగా చూస్తే పవన్(Pawan Kalyan) పర్యటనలో పెద్ద విశేషమేమీ కనిపించదు. కానీ, ఏపీ రాజకీయాలే సెపరేటు కదా. తరచి చూస్తే తప్ప అర్థం కావవి. పవన్ పర్యటన వెనక అలాంటి మతలబే ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కారణం.. గత నెలలో చిత్తూరు జిల్లాలో పర్యటించిన పవన్.. హెలికాప్టర్ నుంచి వెళుతూ పెద్దిరెడ్డి(Peddireddy Ramachandra Reddy) అక్రమ సామ్రాజ్యం అంటూ కొన్ని ఫొటోలు తీసి మీడియాకు వదిలారు. దానిపై కూటమి అనుకూల మీడియా ఎంత చేయాలో అంతా చేసింది. అయితే, ఇదేమీ అప్పటికప్పుడు అనుకొని చేసిన పని కాదనే విషయం ఎవరికైనా సులభంగా అర్థమవుతుంది. ఈ క్రమంలో నెల తిరగక ముందే పవన్ కళ్యాణ్ మరోసారి చిత్తూరు జిల్లా పర్యటనకు వెళుతుండడంపై అనుమానాలు కలగడం సహజమే.

బీజేపీకి దగ్గర కానివ్వకుండా..:

చిత్తూరు జిల్లా అంతటా ప్రభావం చూపగలిగే స్థాయి పెద్దిరెడ్డి కుటుంబానికి ఉంది. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి రాష్ట్రమంతటా తీవ్ర వ్యతిరేక పవనాలు వీచినప్పటికీ పెద్దిరెడ్డి కుటుంబం నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా, ఒకరు ఎంపీగా ఎన్నికయ్యారు. పుంగనూరు నుంచి పెద్దిరెడ్డి, ఆయన తమ్ముడు ద్వారకనాథ రెడ్డి తంబళ్లపల్లె నుంచి ఎమ్మెల్యేలు కాగా, రాజంపేట నుంచి మిథున్ రెడ్డి ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీకి, జగన్ కు అండదండగా ఉంటున్న పెద్దిరెడ్డి ఫ్యామిలీని ఎలాగైనా దూరం చేయాలనే పావులు కదపడం మొదలైంది. అయితే, చాలా బలమైన కుటుంబమైన పెద్దిరెడ్డి కుటుంబానికి బీజేపీ అధిష్టానంతో పరోక్షంగా బలమైన సంబంధాలు ఉన్నాయి.

ఇటీవల ఏపీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వ్యతిరేకించినా ఎంపీ మిథున్ రెడ్డి(Mithun Reddy)ని కేంద్రం ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సమావేశాల్లో భారత ప్రతినిధి బృందంలో పంపడమే దీనికి నిదర్శనం. అప్పటి నుంచే పెద్దిరెడ్డి కుటుంబం బీజేపీకి మరింత దగ్గరవకుండా చూడాలని టీడీపీ భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఆ బాధ్యతలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అప్పగించినట్లు తెలుస్తోంది. ఫలితంగానే గత నెలలో చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్లిన పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా హెలికాప్టర్ నుంచి పెద్దిరెడ్డి కుటుంబం భూముల ఫొటోలను తీసినట్లు అర్థమవుతోంది. నిజానికి అటవీ శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న పవన్ కళ్యాణ్.. పెద్దిరెడ్డి ఆక్రమించినట్లు చెబుతున్న అటవీ భూములను ప్రభుత్వానికి స్వాధీనం చేయించొచ్చు. అధికారులతోనే ఆ పని అయిపోతుంది. కానీ, ఇక్కడ పవన్, టీడీపీ ఉద్దేశం వేరు. ఏదో విధంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేయడం, వారిని బీజేపీకి దగ్గర కాకుండా చూడడమే ప్రధాన లక్ష్యం. మరి, ఏపీ బీజేపీ ఏం చేస్తుంది అంటారా? అక్కడ ఉన్నదంతా టీడీపీ మనుషులేననే విషయం బీజేపీ అధిష్ఠానానికి తెలియంది కాదు కదా. ఇకపోతే, నెల తిరగక ముందే పవన్ మరోసారి చిత్తూరు జిల్లాలో పర్యటించడం వెనక మరొక స్వకార్యం కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అదేంటంటే వారం కిందట కోనసీమ పర్యటనలో పవన్ కళ్యాణ్ తెలంగాణను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు పవన్ పర్యటన ఆ వ్యాఖ్యల్ని మరిపించేలా ఉంటుందనడంలో సందేహం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: వాళ్లు మనుషులే కాదు.. గళమెత్తిన రష్మిక

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>