చంద్రుని చుట్టూ ప్రయాణించడం అనేది ఒక చందమామ కథలా అనిపిస్తుంది. కానీ దానిని నిజం చేయడానికి నాసా ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ ఆ అవకాశాన్ని అందిస్తోంది. కాకపోతే ఇక్కడ మనుషులను కాదు.. వాళ్ల పేర్లను చంద్రుని ట్రిప్‌కు తీసుకెళ్లనుంది నాసా. 2026లో ప్రయాణించబోయే ఆర్టెమిస్–II మిషన్‌లో మీ పేరును చంద్రుని చుట్టూ తీసుకెళ్లే అవకాశం అందుబాటులో ఉంది. NASA అధికారిక వెబ్‌సైట్‌లో మీ పేరు నమోదు చేస్తే, మీ పేరుతో కూడిన డిజిటల్ “బోర్డింగ్ పాస్” వెంటనే లభిస్తుంది. అనంతరం మీ పేరు ఒక ప్రత్యేక మెమరీ కార్డు రూపంలో అంతరిక్ష నౌకలో ఉంచి, ఆ మిషన్‌తో పాటు చంద్రుని చుట్టూ ప్రయాణం చేస్తుంది. ఈ ప్రక్రియ పూర్తిగా ఉచితం — మీ కుటుంబ సభ్యులు, మిత్రులు, పెంపుడు జంతువుల పేర్లను కూడా పంపవచ్చు. ఆర్టెమిస్–II మిషన్ 50 సంవత్సరాల తర్వాత జరగబోయే తొలి మనుషుల చంద్రపరిభ్రమణ యానం. ఈ ప్రయాణంలో ముగ్గురు NASA వ్యోమగాములు, ఒకరు కెనడా నుంచి పాల్గొంటారు. సుమారు 10 రోజుల ఈ మిషన్‌లో అంతరిక్ష నౌక చంద్రుని చుట్టూ తిరిగి భూమికి తిరిగివస్తుంది. ఇప్పటికే దాదాపు ఒక మిలియన్ మంది తమ పేర్లు నమోదు చేసుకున్నారు. అంతరిక్ష ప్రపంచంతో ప్రతిఒక్కరినీ అనుసంధానించేందుకు ఇదొక వినూత్న ప్రయత్నమని NASA చెబుతోంది. మీ పేరు కూడా చంద్రుని చుట్టూ తిరగాలని అనుకుంటే, NASA వెబ్‌సైట్‌లో వెళ్లి ఫారమ్ నింపితే చాలు. అంతరిక్ష ప్రయాణంలో మీ పేరు చేరిపోయినట్టే!
Read Also: టార్గెట్ పెద్దిరెడ్డి?
Follow Us on: Facebook


