తెలంగాణ సాధనలో అమరవీరుల త్యాగం వెలకట్టలేనిది. తొలి దశలోనూ మలి దశలోనూ.. వందలాది మంది బలిదానం చేయడంతోనే స్వరాష్ట్రం కల సాకారమైంది. వారి ఆత్మార్పణే రాష్ట్ర ఏర్పాటుకు దివిటీగా మారింది. ఇది కాదనలేని సత్యం. అయితే, రాష్ట్రం తర్వాత అమరవీరులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం నుంచి తగిన గుర్తింపు, ఆర్థిక సాయం అందిందా? అంటే అవునని చెప్పలేని పరిస్థితి. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అయినా రెండేళ్ల పీఠం దక్కించుకున్న కాంగ్రెస్ అయినా అమరవీరులకు, వారి కుటుంబాలకు తగిన న్యాయం చేయలేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఈ క్రమంలోనే అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలని గళమెత్తుతున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత(Kavitha). ఇప్పటికీ అధికశాతం అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆమె ఆరోపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రకటించిన డిసెంబర్ 9న అయినా, ఆ కుటుంబాలను సన్మానించి వారికి తగిన సాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగేంతవరకు పోరాడుతానని హెచ్చరిస్తున్నారు.ఈ క్రమంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపైనా ఆమె విమర్శలు గుప్పిస్తున్నారు.
పదేళ్లు అధికారంలో ఉన్నా..:
తెలంగాణ ఉద్యమంలో తొలి దశలో 369 మంది, మలి దశలో 1,200 మందికిపైగా బలిదానం అయినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.కానీ, వీరిలో ఇప్పటివరకు కేవలం 540 మంది కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వ సాయం, గుర్తింపు లభించింది. ఇవీ ప్రభుత్వ లెక్కలే.నిజానికి ఎవరు అధికారంలో ఉన్నా అమరవీరుల కుటుంబాలను సత్కరించుకోవడం, ఆదరించడం విధిగా చేయాల్సిన పని. కానీ, పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్.. శ్రీకాంతాచారి లాంటి కొంతమంది కుటుంబాలకు తప్ప పూర్తిగా అన్ని కుటుంబాలను ఆదుకున్న దాఖలాలు లేవు. అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగం, భూమి, వ్యాపారం, ఉపాధి కల్పిస్తామని గత ప్రభుత్వం చెప్పింది.
అయితే, వాస్తవంగా వాటి ప్రయోజనాలు అందింది కొన్ని కుటుంబాలకే. మరోవైపు ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సైతం అమరవీరుల కుటుంబాలకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదని, తాము అధికారంలోకి వచ్చాక, ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని మేనిఫెస్టోలో సైతం చెప్పింది. కానీ, ఈ ప్రభుత్వ హయాంలోనూ అమరవీరుల కుటుంబాలన్నింటికీ న్యాయం జరగలేదని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, జాగృతి అధ్యక్షురాలు కవిత(Kavitha)కు హఠాత్తుగా అమరవీరుల కుటుంబాల విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తోంది. అయితే,బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కవితకు అమరవీరుల కుటుంబాలు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నలు, అనుమానాలు రేకెత్తుతున్నాయి. అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేయాలనే కవిత డిమాండ్ సహేతుకమే అయినప్పటికీ ఆమె పోరాటం నిస్వార్థమా? స్వప్రయోజనమా? అనేది కాలమే తేల్చాలి.
Read Also: కేంద్రం నుంచి గ్రామాలకు ఫండ్స్ రిలీజ్
Follow Us On: WhatsApp Channel


