కలం, ఖమ్మం బ్యూరో : భారత తొలి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ (Ambedkar) విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా, మణుగూరు మండలంలోని సమితి సింగారం గ్రామ పంచాయతీ ముందు ఉన్న అంబేద్కర్ విగ్రహం అధికారుల నిర్లక్ష్యానికి ప్రతీకగా నిలిచింది. చెత్త, చెదారం, దుమ్ము, ధూళితో నిండి మొహం మీద మురికి వస్త్రంతో చాలా దయనీయమైన స్థితిలో ఉంది. మూడు దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అపచారం స్థానికంగా తీవ్ర దుమారం రేపుతుంది.
గతంలో ఈ విగ్రహం బందరిగూడెం టీడీపీ సెంటర్‌లో ఉండేది. రోడ్ల విస్తరణలో భాగంగా ఈ విగ్రహాన్ని తొలగించి కొత్త అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. పాత విగ్రహాన్ని సమితి సింగారం పంచాయతీ ఆఫీస్ ముందు పెట్టారు. కానీ నిర్వహణ గాలికి వదిలేశారు. గత 30 ఏళ్లుగా ఎంతో ఆదరణ పొందిన ఈ విగ్రహం నేడు చిందరవందరగా, చెత్తాచెదారంతో కప్పబడి ఉండటంపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రస్తుతం సమితి సింగారంలో కూడా రోడ్లు విస్తరిస్తున్నారు. అందులో భాగంగా రోడ్డుకి ఇరువైపుల చెట్లను నరుకుతున్నారు. అలా నరికివేసిన పెద్ద పెద్ద చెట్ల మొదళ్లను విగ్రహ ప్రాంగణంలో పడవేయడంతో అక్కడ అపరిశుభ్ర వాతావరణం నెలకొనింది. విగ్రహం ఏర్పాటు చేసినంత మాత్రాన, పాత విగ్రహాన్ని అగౌరవపరచడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. విగ్రహ ప్రాంగణాన్ని అగౌరవపరిచేలా వ్యవహరించిన అధికారులపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి, అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని శుభ్రం చేయించాలని, ఆ ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకురావాలని మణుగూరు దళిత సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు.


