Mobile Popup Ad
Mobile Popup Ad

ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న అధికారులను బదిలీ చేయాలి : ఏఐవైఎఫ్ నేత యుగంధర్

కలం, కరీంనగర్ బ్యూరో : మహిళా శిశు సంక్షేమ శాఖలో ఇటీవల ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న అధికారులను బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని ఏఐవైఎఫ్ (AIYF) రాష్ట్ర సహాయ కార్యదర్శి బావండ్ల పెళ్లి యుగంధర్ కోరారు. మహిళా శిశు సంక్షేమ శాఖలో ఇటీవల పలు జిల్లాలలో ఏసీబీ దాడులు, విచారణలు జరుగుతున్న నేపథ్యంలో సంబంధిత అధికారులను అదే స్థానంలో కొనసాగించడం వలన సాక్ష్యాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంటుందన్నారు. అంతేకాకుండా శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులపై ఒత్తిడి, వేధింపులు పెరిగే ప్రమాదం ఉన్నదని యుగంధర్ ఆరోపించారు.

గతంలో జిల్లా సంక్షేమ అధికారిపై శాఖలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు వేధింపుల గురించి అప్పటి జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదులు చేసినప్పటికీ తగిన చర్యలు తీసుకోలేదని తెలిపారు. అలాగే శాఖలో పనిచేస్తున్న కొంతమంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు వేధింపులు భరించలేక గతంలో రాజీనామా చేసి వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమావేశంలో పోషణ అభియాన్ విభాగంలో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగిని అంగన్‌వాడీ టీచర్లు, మండల అధికారుల సమక్షంలో అవమానకరంగా దూషించడంతో ఆమె మానసికంగా తీవ్రంగా బాధపడి ఉద్యోగానికి రాజీనామా చేయవలసిన పరిస్థితి ఏర్పడినదని ఆయన వాపోయారు.

ఇక జిల్లా సంక్షేమ అధికారి పై గతంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదైందని గుర్తు చేశారు. ఈ కారణంగా ఏసీబీ విచారణ ఎదుర్కొంటున్న అధికారులను వెంటనే బదిలీ చేసి, విచారణను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు రక్షణ కల్పించి, భయబ్రాంతులకు గురికాకుండా బాధ్యత వహించాలని ప్రభుత్వాన్ని ఒక ప్రకటనలో యుగంధర్ విజ్ఞప్తి చేశారు.

Read Also: బండి భగీరథ్ కేసులో కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>