ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతాం: మంత్రి అడ్లూరి

కలం, కరీంనగర్ బ్యూరో: రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజా ప్రభుత్వం నెరవేర్చుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం ధర్మపురి నియోజకవర్గస్థాయి సమావేశం ధర్మపురిలోని శ్రీ లక్ష్మీనరసింహ గార్డెన్స్ లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చని పథకాలను సైతం అమలు చేస్తున్నామని మంత్రి తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సుమారు రూ.450 కోట్లతో ధర్మపురిలో పుష్కర ఘాట్లు ఇతర మౌలిక సదుపాయాల కోసం అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపించగా, తొలి విడతలో రూ. 115 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.

నియోజకవర్గానికి భారీగా నిధులు..

ధర్మపురి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, ధర్మపురికి డిగ్రీ కాలేజీ మంజూరు చేయించామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, విద్యార్థులు సద్వినియోగం చేసుకొని అడ్మిషన్లు పొందాలని మంత్రి సూచించారు. గడిచిన రెండున్నరేళ్లలో నియోజకవర్గంలోని 474 మంది రైతులకు రైతు బీమా పథకం ద్వారా రూ. 18.7 కోట్లు, రైతు భరోసా పథకంలో 1,21,851 మందికి రూ.188 కోట్లు, 21,917 మంది రైతులకు రూ.161.82 కోట్ల రుణమాఫీ చేసినట్లు స్పష్టం చేశారు. అలాగే 124 మంది రైతులకు రూ.54 లక్షల విలువైన వ్యవసాయ యంత్రాలను అందజేసినట్లు మంత్రి తెలిపారు. నియోజకవర్గంలోని 6 మండలాల్లో 3104 మంది లబ్ధిదారులకు ఇళ్లు మంజూరు చేసి రూ.139 కోట్ల రూపాయలు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు.

గృహజ్యోతి పథకంలో 49,444 మంది లబ్ధిదారులకు 200 లోపు యూనిట్లకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నట్లు చెప్పారు. చేయూత పెన్షన్ పథకం ధర 49,299 మంది లబ్ధిదారులకు రూ.10.97 కోట్లు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మి పథకంలో 2862 మందికి రూ.10.91 కోట్లు అందించినట్లు మంత్రి తెలిపారు. నియోజకవర్గంలో 15,835 మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పలువురికి కళ్యాణ లక్ష్మి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించారు.

టెంపుల్‌ ప్లాన్ రెడీ..

కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ధర్మపురి టెంపుల్ సిటీ మాస్టర్ ప్లాన్ ఫైనల్ అయినట్లు తెలిపారు. త్వరలోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా పనులను ప్రారంభిస్తామని తెలిపారు. ధర్మపురిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న డిగ్రీ కళాశాలను సద్వినియోగం చేసుకొని అడ్మిషన్లు పొందాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్ అన్నారు. ధర్మపురి మున్సిపల్ ఛైర్మన్ వేముల నాగలక్ష్మి మాట్లాడుతూ.. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నియోజకవర్గంలోని పలు సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. స్వచ్ఛ గోదావరికి మంచి స్పందన లభిస్తుందన్నారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>