మందుబాబులకు చుక్కలు.. మత్తు వదిలిస్తున్న పోలీసులు

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసులు ( Karimnagar Police) ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లా పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఆదేశాల మేరకు కరీంనగర్ లో పోలీసులు నిర్వహిస్తున్న ముమ్మర తనిఖీలతో మద్యం బాబుల గుండెల్లో వణుకు మొదలైంది. “చుక్క వేసి బండి తీస్తే.. పట్టపగలే చుక్కలు చూపిస్తాం” అన్నట్లుగా పోలీసులు క్షేత్రస్థాయిలో కఠినంగా వ్యవహరిస్తుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గతంలో మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జిల్లాలో అనేక ఘోర ప్రమాదాలు చోటుచేసుకునేవి. అమాయక ప్రాణాలు గాల్లో కలవడమే కాకుండా అనేక కుటుంబాలు వీధిన పడేవి. ఈ పరిస్థితులను గమనించిన జిల్లా యంత్రాంగం, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిరంతర ప్రక్రియగా మార్చింది. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, ప్రధాన జాతీయ రహదారుల నుంచి మండల స్థాయి లోపలి రోడ్ల వరకు పోలీసులు ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా మద్యం మోతాదు ఎక్కువగా ఉన్నవారిని కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. రోడ్డు భద్రతా నిబంధనలను ఉల్లంఘించి మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ఇటీవల తనిఖీల్లో పట్టుబడ్డ నలుగురిలో న్యాయస్థానం ఒకరికి 14 రోజుల జైలు శిక్ష, మరో ముగ్గురికి 7 రోజుల జైలు శిక్ష విధించారు. గత వారం మరో ముగ్గురికి 4 రోజుల జైలు శిక్ష విధించారు. దీంతో పాటు భారీ జరిమానాలు సైతం విధించారు.

నిరంతర తనిఖీలు..

పోలీసుల ఈ కఠిన నిర్ణయాల వల్ల జిల్లాలో గత కొన్ని మాసాలుగా రోడ్డు ప్రమాదాల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. సామాజిక బాధ్యతతో పోలీసులు చేస్తున్న ఈ కృషిపై జిల్లా ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “మద్యం మత్తులో వాహనం నడపడం అంటే తన ప్రాణాలకే కాక ఎదుటివారి ప్రాణాలకు కూడా ముప్పు తెచ్చినట్లే. పోలీసులు ఇలాగే కఠినంగా వ్యవహరిస్తేనే రోడ్లపై భద్రత ఉంటుంది.” అని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. భారీ వాహన చోదకులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు. తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నిబంధనలు అతిక్రమిస్తే జైలు శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, డ్రోన్లు, డీజేలపై నిషేదాజ్ఞులు విధించడం లాంటి పోలీసుల నిబద్ధత వల్ల మందుబాబులు ఇప్పుడు వాహనం తీయాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. రక్షణ కవచంలా మారుతున్న పోలీసుల పనితీరుతో కరీంనగర్ జిల్లా రోడ్లు ఇప్పుడు మరింత సురక్షితంగా మారుతున్నాయి. ప్రాణ నష్టాన్ని నివారించడంలో పోలీసులు చూపుతున్న చొరవకు ‘శభాష్ పోలీస్’ అని చెప్పక తప్పదు.

రోడ్డు ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి..

కరీంనగర్‌లో పోలీసుల ఆద్వర్యంలో ఇటీవల అరైవ్ అలైవ్ అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించడంతోపాటు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. అడిషినల్ డీజీపీ (సిఐడి, ఏసిబి) చారు సిన్హా హాజరై రోడ్డు ప్రమాదాల నివారణపై దిశా నిర్దేశం చేశారు. ప్రమాదాల నివారణకు ఢిఫెన్సింగ్ డ్రైవింగ్ కీలకమని వివరించారు. హెల్మెట్, సీటు బెల్ట్ తప్పనిసరిపై అవగాహన పెంపొందిస్తూనే పలువురికి హెల్మెట్ లు అందజేశారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల ఆద్వర్యంలో విధ్యార్థులతో రహదారి భద్రతపై మానవహారాలు చేపడుతూ ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను చాటుతున్నారు.

గతేడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల 200 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో అధిక శాతం ద్విచక్ర వాహనదారులే ఉండటం విచారకరం. హెల్మెట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. పోలీసుల నిరంతర నిఘా, చర్యల వల్ల జిల్లాలో ప్రమాదాల రేటు 17 శాతం తగ్గింది. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే ‘గోల్డెన్ అవర్’ లో బాధితులను ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం ‘రహ వీర్’ పథకం ద్వారా రూ. 25,000 నగదు బహుమతి అందజేస్తుందని సీపీ తెలిపారు. అలాగే జిల్లాలోని 33 ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో ప్రమాద బాధితులకు రూ. 1.5 లక్షల వరకు ఉచిత నగదు రహిత చికిత్స అందుబాటులో ఉందని వివరిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>