రోడ్డు భద్రతపై చారు సిన్హా కీలక సూచనలు

కలం, కరీంనగర్ బ్యూరో: ప్రస్తుత సమాజంలో రోడ్డు ప్రమాదాల వల్ల ఎంతో మంది యువత ప్రాణాలు కోల్పోవడం అత్యంత ఆందోళనకరమని, రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని రాష్ట్ర అడిషనల్ డీజీపీ చారు సిన్హా (ADGP Charu Sinha) పేర్కొన్నారు.  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా, డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ 13 నుంచి 18 వరకు రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పర్యవేక్షణలో అస్త్ర కన్వెన్షన్ హాలులో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చారు సిన్హా (ADGP Charu Sinha) మాట్లాడుతూ, ప్రమాదాల నివారణకు ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ ఎంతో కీలకమని చెప్పారు. ఒక్కరి నిర్లక్ష్యం వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్ ప్రాణాపాయానికి దారితీస్తాయని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ ఉపయోగించడం నేరమని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా మెడికవర్ ఆసుపత్రి వైద్య బృందం విద్యార్థులకు అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడే సీపీఆర్ (CPR) విధానంపై ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చింది. అలాగే మాక్స్ విజన్ కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులందరితో రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం పలువురు విద్యార్థులకు అడిషనల్ డీజీపీ చేతుల మీదుగా ఉచిత హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు శ్రీనివాస్, వెంకటస్వామి, విజయకుమార్, యాదగిరిస్వామి, వేణుగోపాల్, శ్రీనివాస్ జి, వైద్యులు, పోలీస్ అధికారులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Read Also: సురక్షిత ప్రయాణాలే ‘అరైవ్ అలైవ్’ లక్ష్యం: అడిషనల్ డీజీ చారు సిన్హా

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>