కలం, తెలంగాణ బ్యూరో : వచ్చే ఏడాది రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తానంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR Padayatra) ఇటీవల ప్రకటించారు. ఒకవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్సే.. అధికారంలోకి వచ్చేది ఆ పార్టీయే.. ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే.. అంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నా అధికారంలోకి రావడమే లక్ష్యంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ సందర్భంగా పేర్కొన్నారు. పాదయాత్ర ఆ పార్టీకి ఏ మేరకు కలిసొస్తుందో తెలియదుగానీ గతంలో కేసీఆర్ అభిప్రాయానికి భిన్నంగా కేటీఆర్ ప్రకటన చేశారు. బీఆర్ఎస్ పార్టీకి తండ్రి కేసీఆర్ ప్రెసిడెంట్‌గా ఉంటే కొడుకు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కానీ పాదయాత్ర విషయంలో మాత్రం ఇద్దరిదీ భిన్నాభిప్రాయం. తండ్రి పాదయాత్ర పనికిరాదనే అభిప్రాయంతో ఉంటే కొడుకు మాత్రం అది గెలుపును తీసుకొస్తుందనే భావనతో ఉన్నారు. ఇద్దరూ పార్టీకి నాయకత్వం వహించే స్థానంలో ఉన్నా పాదయాత్ర విషయంలో మాత్రం ఏకాభిప్రాయం లేకపోవడం గమనార్హం.
పాదయాత్రపై కేసీఆర్ వైఖరేంటి? :
పాదయాత్రలపై కేసీఆర్‌కు స్పష్టమైన అభిప్రాయం ఉన్నది. అవి ఓట్లు రాల్చవని, అధికారంలోకి తీసుకురావని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. రాష్ట్రంలో 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలువురు పాదయాత్రలు చేస్తున్న సందర్భాన్ని ప్రస్తావించి చాలా సూటి కామెంట్లే చేశారు. మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నిక ముగిసిన తర్వాత ప్రగతి భవన్ వేదికగా 2022 నవంబరు 7న కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు “పాదయాత్రలు అనేవి ఇప్పుడు ఔట్ డేటెడ్ అయిపోయాయి… ఇప్పుడున్నది టెక్నాలజీ యుగం… సోషల్ మీడియా, డిజిటల్ కమ్యూనికేషన్ అందుబాటులో ఉన్నాయి.. పాదయాత్రలు ఇప్పుడు వర్కౌట్ కావు..” అని స్పష్టంగా చెప్పారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బీజేపీ నేత బండి సంజయ్, ప్రజా ప్రస్థానం పేరుతో వైఎస్ షర్మిల పాదయాత్రలు చేస్తున్న అంశాలను గమనంలోకి తీసుకుని కేసీఆర్ అప్పట్లో ఆ వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో పాదయాత్రలకంటే ప్రజలకు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమని, ప్రజలు పనులను చూసి ఓట్లు వేస్తారుగానీ పాదయాత్రలను చూసి కాదు అని అభిప్రాయపడ్డారు.
కేసీఆర్ వైఖరికి భిన్నంగా కేటీఆర్ అభిప్రాయం :
మూడేండ్ల క్రితం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్ తన నిర్ణయాన్ని ప్రకటించడం అటు పార్టీలో ఇటు ప్రజల్లో చర్చకు దారితీసింది. పాదయాత్రలు ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ అంటూ కేసీఆర్ సూటిగా చెప్పినా వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో దానికి భిన్నమైన నిర్ణయాన్ని కేటీఆర్ వెల్లడించడం పార్టీ శ్రేణుల్లోనే సరికొత్త కన్‌ఫ్యూజన్‌కు దారితీసింది. మంచిర్యాలలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్ సందర్భంగా కేటీఆర్ పాదయాత్ర (KTR Padayatra) గురించి వివరణ కూడా ఇచ్చారు. “ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకోవడం, క్షేత్రస్థాయిలో ప్రజలతో తిరిగి మమేకం కావడం, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం.. ఈ అంశాలే పాదయాత్ర ప్రధాన లక్ష్యం.. గత పదేళ్ల పాలనలో పార్టీ క్యాడర్‌కు, ప్రజలకు మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది.. దీన్ని పూడ్చుకోవడానికే పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నాం..” అని వివరణ ఇచ్చారు. వచ్చే సంవత్సరం (2027లో) రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. తండ్రి లైన్ అలా.. కొడుకు లైన్ ఇలా.. అనే చర్చలకు సమాధానం కరువైంది.
Read Also: స్లీపర్ బస్సు.. జర్నీ టు హెల్
Follow Us On: WhatsApp

