కలం, వరంగల్ బ్యూరో: రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా వాహనదారులు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటించేలా అవగాహన కల్పించడమే “అరైవ్ అలైవ్” (Arrive Alive) కార్యక్రమం లక్ష్యమని రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చారు సిన్హా (ADG Charu Sinha) తెలిపారు. గురువారం హనుమకొండ జిల్లా భీమారం పరిధిలోని కేఎల్ఎన్ ఫంక్షన్ హాలులో వరంగల్ పోలీస్ కమిషనరేట్, రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రోడ్డు భద్రతపై “అరైవ్ అలైవ్” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అడిషనల్ డీజీపీ చారు సిన్హా, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తదితరులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె (ADG Charu Sinha) మాట్లాడుతూ.. “అరైవ్ అలైవ్” కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తెలుసుకుని, ఇతరులకు కూడా అవగాహన కల్పించాలన్నారు. డీజీపీ శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) సురక్షిత ప్రయాణం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు. అతివేగం, అజాగ్రత్త డ్రైవింగ్ వల్ల తమతో పాటు ఇతరుల ప్రాణాలు కూడా ప్రమాదంలో పడతాయని ప్రజల్లో అవగాహన పెరగాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలను బాధ్యతగా పాటిస్తే మనం మాత్రమే కాకుండా ఇతరులు కూడా సురక్షితంగా ఉంటారని పేర్కొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి ఈ కార్యక్రమం ద్వారా నేర్చుకున్న విషయాలను అడగగా, రుత్విక్‌తో పాటు పలువురు విద్యార్థులు, యువకులు స్పందిస్తూ ట్రాఫిక్ నియమాలు పాటించడం, ఓవర్‌టేకింగ్ చేయకపోవడం, ద్విచక్ర వాహనాలపై హెల్మెట్ తప్పనిసరిగా ధరించడం వంటి అంశాలను తెలుసుకున్నామని తెలిపారు.
డ్రైవర్లకు కళ్లద్ధాల కోసం చర్చలు
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ… వారం రోజులపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, డ్రైవర్లకు కళ్లద్దాలు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లో తమ కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులను గుర్తుంచుకుని బాధ్యతాయుతంగా డ్రైవింగ్ చేయాలని సూచించారు. పాఠశాలలు, మండల విద్యాధికారులతో కలిసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు ఈ సందర్భంగా బహుమతులు అందజేస్తున్నామని చెప్పారు. జిల్లా రవాణాశాఖ అధికారి సురేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జనవరిలో రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, “అరైవ్ అలైవ్” కార్యక్రమం ద్వారా కూడా రోడ్డు భద్రతపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు ధార కవిత, అంకిత్ కుమార్, వరంగల్ ఏఎస్పీ శుభం, ట్రైనీ ఐపీఎస్ మనీషా నెహ్ర, వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఎంవీఐలు వేణుగోపాల్, శోభన్ బాబు, కిషోర్ బాబు, ఇతర అధికారులు, వివిధ సంస్థల వాహనాల డ్రైవర్లు, ప్రజలు సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్.. రమావత్ మధు అరెస్ట్
Follow Us On: X(Twitter)

