కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో సంచలనం రేపిన మైక్రో ఫైనాన్స్ ఫ్రాడ్ (Microfinance Scam) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎట్టకేలకు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రమావత్ మధును (Ramavath Madhu) సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొంతకాలంగా పరారీలో ఉన్న మధును సాంకేతిక ఆధారాలతో పోలీసులు పట్టుకున్నారు. కాగా, అరెస్ట్ కు ముందు రమావత్ మధు ఒక వీడియో విడుదల చేశాడు. ఈ వీడియోలో ఈ కుంభకోణంలో ఉన్న అసలు రహస్యలను బయటపెట్టాడు. ఈ స్కామ్ లో ప్రముఖ గాయని మంగ్లీకి ప్రమేయం లేదని తేల్చాడు.
అప్రూవర్ గా రమావత్ మధు
మైక్రో ఫైనాన్స్ ఫ్రాడ్ కేసులో తాను అప్రూవర్ గా మారుతున్నట్లు వీడియో రిలీజ్ చేసిన రమావత్ మధు సంచలన విషయాలను తెలిపాడు. ఈ కేసులో సంబంధం లేని సింగర్ మంగ్లీని తెరపైకి తీసుకొచ్చారని వెల్లడించాడు. మంగ్లీ పేరును వాడుకుని కొందరు లబ్ది పొందే ప్రయత్నం చేశారని ఆరోపించాడు. ఈ కుంభకోణం వెనుక అసలు నింధితుడు హిమాకాంత్ రెడ్డి అని తెలిపాడు. హిమాకాంత్ రెడ్డి ఏకంగా రూ. 20 కోట్లు తీసుకున్నాడన్న రమావత్ మధు.. అడ్వకేట్ సుబ్బారావు, హిమాకాంత్ రెడ్డి మంచి స్నేహితులను చెప్పాడు. హిమాకాంత్ నుంచి డబ్బులు ఇప్పిస్తానని సుబ్బారావు తనకు భరోసా ఇచ్చారని మధు వీడియోలో పేర్కొన్నాడు.
స్కామ్ జరిగిందిలా..
ఈ స్కామ్ (Microfinance Scam) లో భాగంగా పటాన్‌చెరు–దామరగిద్ద ప్రాంతాల్లో వెంచర్ పేరుతో హిమాకాంత్ రెడ్డి, రమావత్ మధుతో పాటు ఇంకొందరు పెట్టుబడిదారుల నుంచి భారీగా డబ్బులు సేకరించారు. ఇందులో భాగంగా నిందితులు 102 స్క్వేర్ యార్డుల ప్లాట్ ఇస్తామని పెట్టుబడిదారులకు హామీ ఇచ్చారు. నెలకు 25,000 చొప్పున 42 నెలలు చెల్లిస్తామని.. అదనంగా నెలకు రూ.25,000 చొప్పున 42 నెలలు చెల్లిస్తామని పెట్టుబడిదారుల్ని ప్రలోభపెట్టారు. అలాగే రూ. 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని మాయమాటలు చెప్పి 33 మంది పెట్టుబడుదారుల నుంచి భారీగా డబ్బులు వసూళ్లు చేశారు. ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా, ఒప్పందాలతోనే కాలయాపన చేస్తుండడంతో ఇన్వెస్టర్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వీరిపై 60కి పైగా కేసులు నమోదయ్యాయి.
తెరపైకి సింగర్ మంగ్లీ పేరు
కాగా, మైక్రో ఫైనాన్స్ కేసులో ప్రముఖ సింగర్ మంగ్లీ పేరు తెరపైకి వచ్చింది. డబ్బు వసూళ్ల వ్యవహారంలో మంగ్లీ ప్రమేయం ఉందని లాయర్ సుబ్బారావు ఆరోపించారు. ఈ మేరకు పంజాగుట్టు పీఎస్ లో ఫిర్యాదు కూడా చేశారు. అయితే లాయర్ సుబ్బారావు ఆరోపణలను మంగ్లీ తప్పుబట్టింది. మైక్రో ఫైనాన్స్ కేసుకు, తనకు ఎలాంటి సంబంధం లేదని.. తనను బద్నాం చేసేందుకే కుట్ర జరుగుందని ఆమె ఆరోపించారు. లాయర్ సుబ్బారావుపై మంగ్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసుతో తనకు సంబంధం ఉందని నిరూపిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమే అని మంగ్లీ తేల్చి చెప్పింది.
Read Also: ఆత్మరక్షణలో బీజేపీ.. జీహెచ్ఎంసీలో నెగెటివ్ ఎఫెక్ట్..
Follow Us On: X(Twitter)

