కలం, తెలంగాణ బ్యూరో : ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చిన చందంగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య (Tejasvi Surya) లోక్‌సభ వేదికగా చేసిన కామెంట్లు తెలంగాణలోని బీజేపీ ఎంపీలను ఆత్మరక్షణలోకి నెట్టాయి. సొంత పార్టీ ఎంపీ చేసిన వ్యాఖ్యలను సమర్ధిస్తే తెలంగాణలో బీజేపి నూకలు చెల్లుతాయి. ఆ పార్టీ ఎంపీని వ్యతిరేకిస్తే పార్టీ క్రమశిక్షణా చర్యలు తప్పవేమోననే జంకు. ఈ రెండింటి మధ్య ఎలాంటి వైఖరి తీసుకోవాలో తెలియక రాష్ట్రంలోని ఎనిమిది మంది బీజేపీ ఎంపీలకు అగ్నిపరీక్షగా మారింది. “గతంలో తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు..” అని సాక్షాత్తూ ప్రధాని మోడీ (PM Modi) కామెంట్ చేశారు. నేడు “ఇండియా-పాకిస్తాన్ విభజన తరహాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌గా విభజించారు” అని కర్ణాటక ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లు యావత్తు తెలంగాణ ప్రజల ఉద్యమాన్ని, త్యాగాన్ని, అరవై ఏండ్ల ఆకాంక్షలను అవమానించడమేనని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
ఇద్దరు కేంద్ర మంత్రులకు అగ్నిపరీక్ష :
బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య (Tejasvi Surya) కామెంట్లు తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆరుగురు ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులకు తలనొప్పి తెచ్చి పెట్టింది. కక్కలేని, మింగలేని డైలమాలో పడ్డారు. తెలంగాణలో బీజేపీ మీద ప్రజలు వ్యతిరేక భావాన్ని ఏర్పర్చుకునేందుకు ఈ కామెంట్లు దోహదం చేయనున్నాయి. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని, బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారంటూ ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఎంత గంభీరంగా చెప్పినా తేజస్వి సూర్య చేసిన కామెంట్లు ఆ ఆశలను ఆవిరి చేసే పరిస్థితులు తలెత్తాయి. తేజస్వి సూర్య కామెంట్లను ఆయన వ్యక్తిగతంగా చేసినవంటూ తెలంగాణ బీజేపీ ఎంపీలు లైట్‌గా తీసుకుంటారా?.. తప్పేముందంటూ సమర్ధిస్తారా?.. లేక పార్టీ అధిష్టానం ఆ వ్యవహారాన్ని చూసుకుంటుందంటూ తప్పించుకుంటారా?.. ఇవీ ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నెగెటివ్ ఎఫెక్ట్ :
త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి నెగెటివ్ ఎఫెక్ట్ కావొచ్చనే అభిప్రాయం ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతల్లో నెలకొన్నది. గత ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ ఈసారి మేయర్ స్థానాన్ని దక్కించుకుంటామన్న ధీమాతో ఉన్నది. కానీ తాజాగా తేజస్వి సూర్య చేసిన కామెంట్లపై బీజేపీ నేతలను జనం ప్రశ్నిస్తే దానికి చెప్పే సమాధానానికి అనుగుణంగా ప్రజలు ఆ పార్టీ పట్ల ఎలాంటి వైఖరితో ఉండాలనే అంశంపై స్పష్టతకు వస్తారు. తేజస్వి సూర్య కర్ణాటకకు చెందిన వ్యక్తిగా అవగాహనా రాహిత్యంతో మాట్లాడారంటూ సన్నాయి నొక్కలు నొక్కుతారా?.. లేక ఆయన వ్యాఖ్యలు సరైనవి కావు అని కరాఖండిగా చెప్తారా?.. ఒకవేల ఆ వ్యాఖ్యలు సరైనవి కావు అని అంగీకరిస్తే వాటిని వెనక్కి తీసుకుంటారా?.. ఇలాంటి ప్రశ్నలను ప్రజలు సంధించే అవకాశాలు లేకపోలేదు.
నాడు ప్రధాని… నేడు సాధారణ ఎంపీ :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమంజసమేనంటూ బీజేపీ నాలుగు దశాబ్దాల క్రితమే కాకినాడలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తీర్మానాన్ని చేసింది. దీన్నే కాకినాడ తీర్మానంగా బీజేపీ గొప్పగా చెప్పుకుంటున్నది. ఒక ఓటు రెండు రాష్ట్రాలు.. అంటూ పదేపదే ఆ తీర్మానం గురించి గుర్తు చేస్తూ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్ధించి పార్లమెంటులో గంభీరంగా మాట్లాడిన దివంగత సుష్మా స్వరాజ్‌ను ‘తెలంగాణ చిన్నమ్మ’గా ఆ పార్టీ చెప్పుకుంటూ ఉంటుంది. ఇదంతా పార్టీకి సంబంధించిన వ్యవహారం కాగా ప్రధాని మోడీ పార్లమెంటు వేదికగానే తల్లిని చంపి.. అంటూ తెలంగాణ ఏర్పాటు ప్రక్రియలో కాంగ్రెస్‌ను విమర్శించారు. చివరకు అది తెలంగాణ ఏర్పాటు మోడీకి ఇష్టం లేదనే సాధారణ అభిప్రాయంగా జనంలోకి వెళ్ళింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తేజస్వి సూర్య ఒక అడుగు ముందుకేసి ఇండియా-పాకిస్తాన్ విభజనతో పోల్చడం బీజేపీకి తెలంగాణలో నెగెటివ్‌గా మారింది.
బీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు రాజకీయ అస్త్రం :
బీజేపీని పొలిటికల్‌గా టార్గెట్ చేయడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు తేజస్వి సూర్య కామెంట్లు అస్త్రంగా మారాయి. ఇప్పటికే మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు తదితరులు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ఏర్పాటు కోసం పార్లమెంటులో 2014లో జరిగిన చర్చ సందర్భంగా పొన్నం ప్రభాకర్ ఎంపీ. తెలంగాణ ఏర్పాటు అంశం కోసం రాష్ట్ర మంత్రి పదవికి సైతం జూపల్లి రాజీనామా చేశారు. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తేజస్వి సూర్య వ్యాఖ్యలను తప్పుపట్టారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సైతం తేజస్వి సూర్యపై పార్టీ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన కామెంట్లను లోక్‌సభ స్పీకర్ రికార్డుల నుంచి తొలగిస్తారా?.. లేక పార్టీపరంగా ఆయనపై క్రమశిక్షణా చర్యలు ఉంటాయా?.. లేక ఆయన నుంచి వివరణ కోరేలా ఈ కామెంట్ల ఇష్యూను పార్లమెంటరీ కమిటీకి వెళ్తుందా?.. ఇలాంటివన్నీ చర్చనీయాంశాలుగా మారాయి.
Read Also: ‘హౌ డేర్ యు’.. తేజస్వీ సూర్యపై కవిత ఫైర్
Follow Us On : WhatsApp

