కలం, తెలంగాణ బ్యూరో: మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ప్రతిపక్షాలకు ఊహించని షాక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. విపక్షాలకు ఊపిరాడకుండా లోక్‌సభ (Lok Sabha) నియమాల్లో అరుదైన అంశాన్ని ప్రయోగిస్తున్నది. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులు ఒకదానితో ఒకటి సంబంధం లేనివని, ఈ రెండింటినీ కలగలిపి బీజేపీ డ్రామా ఆడుతున్నదని కాంగ్రెస్ సహా పలు విపక్షాలు ఆరోపణలు చేస్తున్న సమయంలో వాటి ఊహకు కూడా అందకుండా బీజేపీ మాస్టర్ స్ట్రోక్ వేసింది. లోక్‌సభ రూల్స్ బుక్‌లోని 66వ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు సెక్రటరీ జనరల్ బిజినెస్ లిస్టులో పేర్కొన్నారు. దీంతో ఈ రెండు బిల్లులు వేర్వేరైనా ఒకేదానిగా పరిగణించి చర్చ జరగనున్నది. దీంతో విపక్షాలు ఇప్పటివరకూ ప్రకటించినట్లుగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు తెలిపి డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించే అవకాశం ఉండదు. దేనికి మద్దతు తెలిపినా రెండింటికీ మద్దతు ఇచ్చినట్లవుతుంది. ఏ ఒక్కదాన్ని వ్యతిరేకించినా రెండింటినీ వ్యతిరేకించినట్లవుతుంది. దీంతో విపక్షాలను ప్రజల్లో దోషిగా నిలబెట్టడానికి బీజేపీకి పొలిటికల్ అస్త్రం దొరికినట్లయింది.
లోక్‌సభ రూల్ 66 చెప్తున్నదేంటి? :
ఏవైనా రెండు బిల్లులు ఒకదానిపై మరొకటి పూర్తిగాకానీ, పాక్షికంగాగానీ ఆధారపడడమో లేక అనుబంధంగా ఉండడమో జరిగినప్పుడు రూల్ 66 ప్రకారం హౌజ్‌లో బిజినెస్ ఎలా జరుగుతుందో వివరించే క్లాజ్. ఒక బిల్లు మరో బిల్లుపై పూర్తిగా గానీ లేదా పాక్షికంగా గానీ ఆధారపడి ఉన్నప్పుడు మొదటి బిల్లు ఆమోదం పొందుతుందనే అంచనాతో రూల్ 66 ప్రకారం సభలో ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఆ ప్రకారం మొదటి బిల్లును పార్లమెంటులోని ఉభయ సభలు ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతే దానిపై ఆధారపడిన రెండో బిల్లును సభలు చర్చకు తీసుకుంటాయి. అనంతరం ఆమోదిస్తాయి. కానీ ఇప్పుడు ఈ రూల్-66ను మూడు రోజుల పాటు జరిగే ప్రత్యేక సెషన్‌లో సస్పెండ్ చేస్తున్నందువల్ల ‘ఒక బిల్లు తర్వాతనే రెండో బిల్లు’ అనే షరతు తొలగిపోతుంది. దీంతో రెండు బిల్లులూ కలిసి దాదాపు ఒకే బిల్లు తరహాలో సభలో చర్చకు వస్తాయి. ఓటింగ్, ఆమోదం ప్రక్రియ కూడా ఒక బిల్లు తరహాలోనే పూర్తవుతుంది.
మద్దతైనా, వ్యతిరేకతైనా ఉమ్మడిగానే… :
లోక్‌సభ రూల్-66ను కేంద్ర ప్రభుత్వం ప్రయోగిస్తున్నందున ఆ ప్రకారం ఒక బిల్లుకు మద్దతు, మరో బిల్లుకు వ్యతిరేకత అనే అంశానికి ఆస్కారమే ఉండదు. అటు మద్దతు అయినా, ఇటు వ్యతిరేకత అయినా రెండు బిల్లులకూ కలిపి ఉమ్మడిగా వర్తించనుంది. దీంతో డీలిమిటేషన్ అంశాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తే ఆటోమేటిక్‌గా మహిళా రిజర్వేషన్ బిల్లును కూడా వ్యతిరేకించినట్లవుతుంది. దీంతో లోక్‌సభ రూల్-66 విపక్షాలను బీజేపీ దోషిగా నిలబెట్టడానికి బలమైన పొలిటికల్ అస్త్రంగా వాడుకోనున్నది. మొదటి బిల్లు, రెండవ బిల్లు అనే తేడా లేకుండా ఒకటిగానే టేకప్ చేస్తున్నందున రూల్-66 లోని నిబంధనను సస్పెండ్ చేస్తున్నందున విపక్షాలను ఇరికించినట్లయింది. దీనిపై కాంగ్రెస్ సహా విపక్షాలు ఎలాంటి వైఖరి అనుసరిస్తాయన్నది కీలకంగా మారింది. మరోవైపు రూల్-66 సస్పెన్షన్‌కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకంగా ఎలాంటి ఆందోళన, నిరసన తెలుపుతాయన్నది ఆసక్తికరం. మూడు రోజుల ప్రత్యేక సెషన్‌లో కీలకమైన బిల్లులు చర్చకు వస్తున్నందున ప్రతిపక్షాలు పోషించే పాత్రపైనే దృష్టి కేంద్రీకృతమైంది.

