కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ (Karimnagar) జిల్లా తిమ్మాపూర్ మండలంలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం ‘అరైవ్–అలైవ్’(Arrive Alive) కార్యక్రమం కింద రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు (Road Safety Awareness) నిర్వహించారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రోడ్డు రవాణా శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదాలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. డ్రైవర్లు కంటి పరీక్షలు, శారీరక పరీక్షలు చేయించుకోవాలని, గడువు ముగిసిన వాహనాలు రోడ్లపైకి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
మద్యం సేవించి వాహనాలు నడపకుండా డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలి. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించే వారు సీటు బెల్ట్ తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. ప్రమాదం జరిగిన గోల్డెన్ అవర్‌లో ప్రథమ చికిత్స అందించడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని.. దీనిపై ప్రజల్లో అవగాహన (Road Safety Awareness) పెంచాలని తెలిపారు. ఆర్టీసీ ఆర్ఎం రాజు మాట్లాడుతూ.. దేశంలో ప్రతి సంవత్సరం లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులను వినియోగించాలని సూచించారు. రవాణా శాఖ ఉప కమిషనర్ పెద్దింటి పురుషోత్తం.. అతివేగం, అజాగ్రత్త, నిద్రలేమి, మైనర్లు వాహనాలు నడపడం ప్రమాదాలకు ప్రధాన కారణాలని వివరించారు.
డిఎంహెచ్ఓ వెంకటరమణ సీపీఆర్, ప్రథమ చికిత్సపై అవగాహన అవసరమని తెలిపారు. ఆర్టిఏ మెంబర్ పడాల రాహుల్ ‘రహవీర్’ పథకం ద్వారా ప్రమాద బాధితులకు రూ.1.5 లక్షల వరకు వైద్య సహాయం అందుతుందని, గాయపడిన వారిని ఆసుపత్రికి చేర్చిన వారికి రూ.25 వేల ప్రోత్సాహక నగదు ఇస్తారని వివరించారు. కార్యక్రమంలో విద్యార్థులు రోడ్డు భద్రతపై నాటిక ప్రదర్శించి ఆకట్టుకున్నారు. అనంతరం విద్యార్థులు, అధికారులు రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేశారు. వైద్యులు సీపీఆర్ విధానాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా వాహనాలు నడిపిన ఆర్టీసీ, లారీ, ప్రైవేట్ డ్రైవర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీటీవో శ్రీకాంత్ చక్రవర్తి, ఆర్డీవో మహేశ్వర్ జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్, వాగేశ్వరి ఇంజనీరింగ్ కాలేజ్ సెక్రటరీ గండ్ర శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్ వినోద్ స్థానిక సర్పంచ్ గుజ్జుల శ్వేతా రెడ్డి, రోడ్డు రవాణా శాఖ , వైద్య , ఆర్ అండ్ బి అధికారులు, ఇతరులు పాల్గొన్నారు.
Read Also: ఆత్మరక్షణలో బీజేపీ.. జీహెచ్ఎంసీలో నెగెటివ్ ఎఫెక్ట్..
Follow Us On : WhatsApp

