కలం, వెబ్ డెస్క్ : మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో తన పెంపుడు కుక్కకు తులాభారం వేసిన ఘటనపై నటి టీనా శ్రావ్య (Tina Sravya) స్పందించారు. ఈ విషయం సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీయడంతో ఆమె బహిరంగ క్షమాపణలు చెబుతూ ఒక వీడియో విడుదల చేశారు.
ఇటీవల మేడారం జాతరను సందర్శించిన టీనా శ్రావ్య, తన పెంపుడు కుక్క పేరిట తులాభారం మొక్కును తీర్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులు ఎంతో పవిత్రంగా భావించే మేడారంలో పెంపుడు జంతువులకు తులాభారం వేయడం ఏంటని ప్రశ్నించారు.
వివాదం ముదురుతుండటంతో అప్రమత్తమైన శ్రావ్య (Tina Sravya), తాజాగా ఒక సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. తన పెంపుడు కుక్క ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశంతోనే ఆ మొక్కు తీర్చుకున్నానని, అంతకు మించి ఎవరినీ కించపరచాలనే ఆలోచన తనకు లేదని ఆమె వివరణ ఇచ్చారు. తన చర్య వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని ప్రాధేయపడ్డారు. ఈ విషయాన్ని ఇంతటితో ముగించాలని ఆమె కోరారు.


