కలం, వెబ్ డెస్క్: ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ (Khelo India Games) 2026 ముగిశాయి. తెలంగాణకు చెందిన క్రీడాకారిణి నయనా శ్రీ తల్లూరి (Nayana Sri Talluri) మరోసారి సత్తాచాటింది. లెహ్‌లో జరిగిన ఈ పోటీల్లో 17 ఏళ్ల నయనా షార్ట్ ట్రాక్ స్పీడ్ స్కేటింగ్‌లో రెండు స్వర్ణాలు సాధించింది. 500 మీటర్లు, 1000 మీటర్ల వ్యక్తిగత రేసుల్లో గోల్డ్ మెడల్స్ గెలిచింది. రిలే విభాగాల్లో అనర్హత కారణంగా ఫలితం నిరాశపరిచినా వ్యక్తిగతంగా తన ప్రదర్శన సంతృప్తినిచ్చినట్లు తెలిపింది.
గత మూడేండ్లుగా పతకాల పరంపర కొనసాగుతుండటం ఆనందంగా ఉందని నయనా పేర్కొంది. ఇప్పటివరకు ఖేలో ఇండియా వింటర్ గేమ్స్‌లో ఆమెకు మొత్తం ఆరు పతకాలు వచ్చాయి. ఈ ఏడాది పోటీ మరింత కఠినంగా ఉన్నప్పటికీ స్థిరంగా ఆడగలిగానని ఆమె చెప్పింది. 500 మీటర్ల రేసు వేగంగా ఉండటం ఇష్టమని అయితే 1000 మీటర్లలో తాను మెరుగ్గా రాణిస్తున్నట్లు వివరించింది.
వేసవి శిబిరాల్లో చేరినప్పుడు రోలర్ స్కేటింగ్‌తో మొదలైన నయనా ప్రయాణం ఐస్ స్కేటింగ్ వరకు చేరింది. దేశవిదేశీ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ పతకాలు సాధిస్తోంది. విజయాల వెనుక కుటుంబం చేసిన త్యాగాలు కూడా ఉన్నాయి. శిక్షణ, ప్రయాణ ఖర్చులు భారీగా ఉండటంతో కుటుంబమే ఎక్కువ భారం మోస్తున్నట్లు నయన శ్రీ(Nayana Sri Talluri) తండ్రి తెలిపారు. విదేశాల్లో మూడు నెలల శిక్షణకు రూ.12 నుంచి 14 లక్షల వరకు ఖర్చవుతుందని చెప్పారు.
డిసెంబర్ 2025లో నయనా కెనడాకు వెళ్లి యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీలో చదువుతూ శిక్షణ ప్రారంభించింది. 2026లో జూనియర్ వరల్డ్ కప్‌కు అర్హత సాధించి తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్లు ఆమె తెలిపింది. ఖేలో ఇండియా వేదిక తమలాంటి క్రీడాకారులకు గుర్తింపు ఇస్తుందని నయనా పేర్కొంది. గేమ్స్ ముగిసినా ఆమె ప్రయాణం కొత్త లక్ష్యాల వైపు కొనసాగుతోంది.
Read Also: మహారాష్ట్ర తొలి మహిళా డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం
Follow Us On: Youtube


