epaper
Saturday, January 31, 2026
spot_img
epaper

పంతం నెగ్గిన సిట్.. మెట్టుదిగిన కేసీఆర్

కలం, తెలంగాణ బ్యూరో : ఎట్టకేలకు కేసీఆర్ (KCR) మెట్టు దిగారు. హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలోనే ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping Case) ఎంక్వయిరీకి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ పరిధిలోనే ఎంక్వయిరీ జరగాల్సి ఉంటుందని పేర్కొన్న సిట్ (SIT) పంతమే నెగ్గింది. లీగల్ కోణం నుంచి సుదీర్ఘ చర్చల అనంతరం కేసీఆర్ మెట్టు దిగారు. తొలుత ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌లోనే ఎంక్వయిరీ జరగాలని, పోలీసు ఇన్వెస్టిగేషన్ టీమ్ అక్కడికే రావాలని షరతు విధించారు. సీఆర్పీసీలోని (CrPC) సెక్షన్ 160లోని నిబంధనను గుర్తుచేశారు. కానీ సిట్ మాత్రం ఆ నిబంధన ప్రకారం నందినగర్ (Nandi Nagar) నివాసమే చెల్లుబాటు అవుతుందన్న వాదనను తెరమీదకు తీసుకొచ్చింది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అవమానిస్తున్నారని, ఇంటి గోడకు నోటీస్ అంటించడం ఆత్మగౌరవాన్ని, ప్రతిష్టను దెబ్బతీయడమేనని బీఆర్ఎస్ నాయకులు కామెంట్ చేశారు. కానీ సిట్ వెనక్కి తగ్గకపోవడంతో కేసీఆరే మెట్టు దిగాల్సి వచ్చింది.

లీగల్ నిపుణుల సలహాతో మారిన డెసిషన్ :

సీఆర్పీసీలోని సెక్షన్ 160 ప్రకారం 65 ఏండ్ల వయసు పైబడిన వ్యక్తులకు కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయని స్వయంగా కేసీఆర్ వెల్లడించారు. దీన్నే బీఆర్ఎస్ (BRS) లీగల్ టీమ్ సైతం ప్రస్తావించింది. బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్‌రావు తదితర సీనియర్ నేతలంతా కేసీఆర్ వాదనను సమర్ధించారు. వృద్ధులు ఎక్కడ నివాసం ఉంటే అక్కడే విచారణ జరపాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని నందినగర్ నివాసంలో ఎంక్వయిరీ ఉండాలన్న సిట్ వాదనను వ్యతిరేకించారు. సిట్ టీమ్ మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. నాలుగైదు కారణాలను సెకండ్ టైమ్ ఇచ్చిన నోటీసులో ప్రస్తావించారు. సున్నితమైన కేసు కావడంతో కొన్ని ఫిజికల్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్సులతో విచారణ చేపట్టాల్సిన ఉన్నదని, ఎర్రవల్లి ఫామ్ హౌజ్ అందుకు సరైన వేదిక కాదని పేర్కొన్నది. దీనికి తోడు కొన్ని లాజికల్, లీగల్ అంశాలను కూడా ప్రస్తావించింది. లీగల్ టీమ్‌తో సంప్రదింపుల తర్వాత నందినగర్ నివాసంలో ఎంక్వయిరీకి కేసీఆర్ సిద్ధపడక తప్పలేదు.

కేసీఆర్‌కు ఇది రెండో విచారణ :

అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ హాజరవుతున్న రెండో ఎంక్వయిరీ ఇది. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram) నిర్మాణంలో జరిగిన అవకతవకలు, ఆ ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న మూడు బ్యారేజీలకు జరిగిన డ్యామేజీపై విచారణ జరుపుతున్న జస్టిస్ పినాకి చంద్రఘోష్ (PC Ghose) ఎంక్వయిరీకి గతేడాది హాజరయ్యారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరవుతున్నారు. తొలి విచారణ అనంతరం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. అందులో కేసీఆర్‌ను నిందితుడిగా పేర్కొన్నది. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సైతం యధాతథంగా ఆమోదించింది. అయితే నిందితుడిగా పేర్కొనే ముందు ఇంక్వయిరీ కమిషన్ యాక్ట్ (Commission of Inquiries Act)లోని నిబంధన ప్రకారం తన అభిప్రాయాన్ని తెలుసుకోవాల్సి ఉన్నా ఉల్లంఘన జరిగినట్లు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

కేసీఆర్ ఎంక్వయిరీపై సర్వత్రా ఉత్కంఠ :

ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) కేసీఆర్‌ను సిట్ పోలీసులు ఎన్ని కోణాల నుంచి ప్రశ్నిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు విచారణకు హాజరైన రిటైర్డ్ పోలీసు అధికారులు వెల్లడించిన అంశాలతో కేసీఆర్‌ను లోతుగా ప్రశ్నించే అవకాశమున్నది. ఇప్పటికే వారు ఇచ్చిన వాంగ్మూలాల్లోని వివరాలను కూడా ఎవిడెన్సు రూపంలో కేసీఆర్ ముందు ఉంచొచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇటీవలే కేటీఆర్, హరీశ్‌రావు, సంతోష్‌రావు తదితరులు ఇచ్చిన సమాధానాల్లోంచి కొన్ని అంశాలను ప్రస్తావించనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ల నుంచి వచ్చిన రిప్లైలో చాలా మంది ‘పెద్దాయన’ అంటూ కేసీఆర్ పేరును పరోక్షంగా ప్రస్తావించిన నేపథ్యంలో ఇప్పుడు స్వయంగా ఆయననే ప్రశ్నిస్తున్నందున ఎలాంటి రిప్లై వస్తుందన్నది కూడా కీలకంగా మారింది. ఇంకా కొద్దిమంది సాక్షులను సైతం సిట్ విచారించాలని షెడ్యూలు ప్రిపేర్ చేసుకున్నది.

Read Also: మున్సిపల్​ ఎన్నికల ప్రచారం.. సీఎం రేవంత్​ రెడ్డి షెడ్యూల్​ మార్పు

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>