epaper
Saturday, January 31, 2026
spot_img
epaper

సమ్మక్క-సారలమ్మ వన ప్రవేశం

కలం, వెబ్​ డెస్క్​ : ములుగు జిల్లా మేడారంలో గత నాలుగు రోజులుగా అత్యంత వైభవంగా జరిగిన సమ్మక్క-సారలమ్మ మహాజాతర (Medaram Jatara) శనివారం సాయంత్రం ముగిసింది. జాతరలో అత్యంత కీలకమైన, ఉద్వేగభరితమైన ఘట్టం సమ్మక్క, సారలమ్మల వనప్రవేశంతో ఈ ఉత్సవం అధికారికంగా సంపూర్ణమైంది. కోట్లాది మంది భక్తుల నీరాజనాలు అందుకున్న వనదేవతలు తిరిగి అడవి తల్లి ఒడిలోకి చేరుకున్నారు.

శనివారం సాయంత్రం గిరిజన పూజారులు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం దేవతల తిరుగుపయనం ప్రారంభమైంది. కన్నెపల్లికి సారలమ్మను, చిలకలగుట్టకు సమ్మక్కను తీసుకెళ్లారు. వీరితో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులు కూడా తమ స్థానాలకు చేరుకున్నారు. అమ్మవార్ల వీడ్కోలు సమయంలో భక్తులు భక్తిపారవశ్యంతో ఊగిపోయారు. గద్దెల వద్ద పూజారులు దేవతలను తీసుకెళ్తున్న సమయంలో భక్తుల జయజయధ్వానాలు, డప్పు చప్పుళ్లతో మేడారం పరిసరాలు మార్మోగాయి.

కోట్లాది మంది భక్తులు సమర్పించిన బంగారం (బెల్లం), ఇతర మొక్కులను స్వీకరించిన దేవతలు అడవిలోకి వెళ్లడంతో జాతర ముగిసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే గద్దెల వద్దకు భక్తుల రాక ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్ర కుంభమేళాగా పిలవబడే ఈ జాతర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా పూర్తి కావడంతో భక్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే, మేడారంలో భక్తుల ప్రవాహం శివరాత్రి వరకు కొనసాగనుంది. ఈ జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది కాబట్టి, తదుపరి 2028లో మళ్లీ భక్తులు అమ్మవార్ల దర్శనానికి తరలిరానున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>