Mobile Popup Ad
Mobile Popup Ad

‘రెడ్ జోన్’ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ఈసారి వారికి టికెట్ డౌటే!

కలం, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరి (Congress MLAs)కీ ఈసారి టికెట్‌లు డౌటేనా?.. మరోసారి పోటీ చేసే అవకాశం రాకపోవచ్చా?.. ‘రెడ్ జోన్’లో ఉన్న ఆ ఎమ్మెల్యేలెవరు?.. ప్రజల్లో వారి మీద వ్యతిరేకత ఏ స్థాయిలో ఉన్నది?.. ఆరు నెలల టైమ్ ఇచ్చినా మార్పు రాలేదా?.. ఇదీ ఇప్పుడు పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను వేధిస్తున్న ప్రశ్న. కాంగ్రెస్ మరోసారి పవర్‌లోకి రావాలంటే ఇప్పటికంటే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలవాల్సిందేనన్నది పార్టీ భావన. కచ్చితంగా అధికారంలోకి రావాలన్నది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) టార్గెట్.

కానీ, పలువురు ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందున వారి పనితీరు మార్చుకోకుంటే టికెట్ ఇచ్చి ప్రయోజనం లేదన్నది ఆయన ఉద్దేశం. ఇదే అంశాన్ని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా హెచ్చరించారు. మార్చిలో జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎల్పీ సమావేశంలోనూ సున్నితంగా వార్నింగ్ ఇచ్చారు. పనితీరు మార్చుకోవాల్సిందిగా స్పష్టం చేశారు. ‘సర్’ (SIR) సందర్భంగా పార్టీ లీడర్లతో జరిగిన జూమ్ కాన్ఫరెన్సులో మరోసారి ప్రస్తావించారు.

గెలిచే అవకాశం లేనప్పుడు టికెట్ ఇచ్చి వృథా :

పార్టీ మరోమారు అధికారంలోకి రావడం ఖాయమని ముఖ్యమంత్రి పదేపదే చెప్తున్నారు. ఆయనలో ధీమా కూడా అదే స్థాయిలో ఉంది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేండ్ల సమయం ఉన్నా సీఎం ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. ప్రత్యర్థి పార్టీల కదలికలనూ నిశితంగా గమనిస్తున్నారు. మరోసారి అధికారంలోకి రావాలంటే కచ్చితంగా ఎమ్మెల్యేలు గెలవడం తప్పనిసరి. కానీ చాలాచోట్ల ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్నందున పార్టీకి నష్టం జరగకూడదన్నది సీఎం ఉద్దేశం. జూమ్ సమావేశంలో ఆ విషయాన్నే ఆయన ప్రస్తావించారు.

పార్టీలో సీనియర్.. లాయల్.. హైకమాండ్‌కు దగ్గర.. ఇలాంటివేవీ టికెట్ల సమయంలో పరిగణనలోకి తీసుకోవద్దన్నది సీఎం అభిప్రాయం. ప్రజల్లో తిరగండి.. కష్టపడి పనిచేయండి.. పార్టీని బలోపేతం చేయండి.. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించండి.. ఇలాంటి ఎన్నో సూచనలు చేశారు. ఒక దశలో ‘నేను మారాను.. మీరూ మారండి..’ అని సూటిగానే చెప్పారు. కానీ ఇప్పటికీ కొందరు ఎమ్మెల్యేలలో మార్పు రాలేదని, ఓడిపోతారని తెలిసినా టికెట్ ఇచ్చి పార్టీకి నష్టం కలగొద్దని, గెలుపు గుర్రాలకే అవకాశం ఇవ్వాలని సన్నిహితులతో సీఎం తన అభిప్రాయాన్ని ఇటీవల పంచుకున్నట్లు తెలిసింది.

కీలకంగా ‘రెడ్ జోన్’ లిస్ట్, ప్రోగ్రెస్ రిపోర్టు :

పార్టీ అధికారంలోకి రావాలంటే నేతలు నియోజకవర్గాల్లో అందుబాటులో ఉండాలని, ప్రజల మధ్య తిరగాలని, పాత రాజకీయ పద్ధతులు మార్చుకోవాలని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ నేతల సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు వస్తున్నాయని, గెలిచిన తర్వాత ప్రజలకు దూరమైతే రాజకీయంగా మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. ఎమ్మెల్యేలకు కూడా తెలియకుండా సీఎం నిర్వహించిన థర్డ్ పార్టీ సర్వేలో కొందరు సిట్టింగ్‌లపై ప్రజల్లో అసంతృప్తి నమోదైనట్లు వెల్లడైంది.

దాదాపు పాతిక మందికిపైగా ఎమ్మెల్యేలు ‘రెడ్ జోన్’లో ఉన్నట్లు తేలింది. ప్రభుత్వం పట్ల అసంతృప్తికంటే ఎమ్మెల్యేల పనితీరుతోనే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందనే అంశం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రోగ్రెస్ రిపోర్టును దృష్టిలో పెట్టుకునే ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ఎక్కువగా కనిపించాలని, ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారు. తాజాగా ధాన్యం కొనుగోళ్ళ సమయంలోనూ ఎమ్మెల్యేలకు ‘ప్రజల్లో ఉండాలి.. వారికి అందుబాటులో ఉండాలి..’ అని స్పష్టం చేశారు.

బడ్జెట్ సెషన్ సందర్భంగా ఎమ్మెల్యేలపై సీఎం ఫైర్ :

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు మార్చి 16న జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో కొందరు ఎమ్మెల్యేల తీరుపై రేవంత్ తీవ్రస్థాయిలోనే అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీకి హాజరు కాకపోవడం, చర్చల్లో పాల్గొనడానికి గ్రౌండ్ వర్క్ చేసుకోకపోవడం, సమావేశాలకు పూర్తిస్థాయిలో సిద్ధం కాకుండా రావడం, లాబీల్లో కాలక్షేపం చేయడం వంటి అంశాలపై మందలించినట్లు పార్టీ వర్గాలు అప్పట్లోనే వెల్లడించాయి. ఎమ్మెల్యేలు క్రమశిక్షణ పాటించాలని, ప్రజా సమస్యలపై అధ్యయనం చేసి రావాలని స్పష్టం చేశారు.

అసెంబ్లీ సెషన్‌ను మాత్రమే ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు కావని, ఎమ్మెల్యేల రాజకీయ పనితీరుపై ఉన్న అసంతృప్తికి నిదర్శనమని పార్టీ లీడర్లు క్లారిటీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పార్టీ నిర్వహించిన అంతర్గత సర్వేలోని అంశాలనూ ప్రస్తావించారు. అవసరమైతే ఆ రిపోర్టులను వారికి పంపిస్తానని కూడ అన్నారు. ఆ నేపథ్యంలోనే ‘ఈసారి గెలుపు అవకాశాలు ఉన్నవారికే టికెట్లు’ అనే కామెంట్ చేశారు. సర్వేల్లో ప్రత్యర్థులకంటే వెనకబడి సెకండ్ ఉన్నవారికి కార్పొరేషన్లలో అవకాశాలు ఇస్తామన్నారు.

పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో ఘాటు వ్యాఖ్యలు :

ఈ నెల సెకండ్ వీక్‌లో గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలోనూ సీఎం రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యేల (Congress MLAs) పనితీరు అంశాన్ని కాస్తు తీవ్ర స్వరంలోనే ప్రస్తావించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొందరు ఎమ్మెల్యేలు, స్థానిక నాయకులు విఫలమవుతున్నారని, ప్రజల మధ్యకి వెళ్లకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. రెండున్నరేళ్ల పాలన పూర్తయిన తర్వాత ప్రజాభిప్రాయాన్ని తిరిగి అంచనా వేయాల్సి ఉంటుందని, అప్పటి పనితీరు ఆధారంగానే నిర్ణయాలు ఉంటాయని సీఎం స్పష్టం చేశారు.

తాజాగా ‘సర్’ సందర్భంగా జూమ్ మీటింగ్‌లోనూ కఠినంగా మాట్లాడారు. కొందరు నాయకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, పార్టీ ఆదేశాలను పాటించని నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలవారీగా నివేదికలు తన వద్ద ఉన్నాయని, రాబోయే 10 రోజుల్లో వాటిని పరిశీలించి ఎమ్మెల్యేల (Congress MLAs) పనితీరును సమీక్షిస్తానన్నారు. పార్టీ ఆదేశాలను నియోజకవర్గ ఇన్‌ఛార్జీలు అమలు చేయకపోతే వారినీ మార్చేస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వంపై కాదు.. ఎమ్మెల్యేలపైనే.. :

‘ప్రభుత్వంపైన ప్రజలు ఏమనుకుంటున్నారు?.. ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉన్నది?.. ఈ రెండు అంశాలతోనే సీఎం ప్రత్యేకంగా సర్వే చేయించుకుంటున్నట్లు తెలిసింది. ప్రభుత్వంపై అసంతృప్తి పెద్దగా లేకపోయినా కొందరు ఎమ్మెల్యేల పనితీరే ప్రమాదకరంగా ఉన్నట్లు ప్రాథమిక వివరాలు సీఎంకు అందినట్లు సమాచారం. “సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ ఆటోమేటిక్‌గా టికెట్లు వస్తాయనే భ్రమలొద్దు” అని ఇప్పటికే సీఎం క్లారిటీ ఇచ్చారు.

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నా ఇప్పటి నుంచే సీఎం కసరత్తు మొదలుపెట్టడం వెనక పకడ్బందీ వ్యూహం ఉన్నదనేది స్పష్టమవుతున్నది. ఎమ్మెల్యేల పనితీరుపై నిఘా పెట్టిన సీఎం ఈసారి ‘గెలుపు గుర్రాలకే టికెట్లు.. ప్రోగ్రెస్ రిపోర్టులో పాస్ అయితేనే టికెట్…’ అనే కొత్త ఫార్ములా అమలుకానున్నది. మారకపోతే మార్చేస్తాం.. అనే గతంలో చేసిన వ్యాఖ్యలకు తాజాగా జూమ్ మీటింగ్‌లో సీఎం చేసిన కామెంట్లు క్లారిటీ ఇచ్చినట్లయింది.

Read Also: అమెరికా పౌరసత్వం వదిలి.. 94 ఏళ్ల బామ్మ సంచలన నిర్ణయం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>