కలం, తెలంగాణ బ్యూరో: రాయదుర్గంలోని భూముల వేలం (Raidurgam Land Auction) వివాదాస్పదంగా మారి టీజీఐఐసీ (TGIIC) మెడకు చుట్టుకున్నది. ఒక్కో ఎకరం ధర రూ.237 కోట్లు పలికిందంటూ చెప్పుకున్నప్పటికీ లీగల్ చిక్కులు వెంటాడుతున్నాయి. వేలంలో విక్రయించిన భూముల్లో ఐదెకరాలు 2010లో తాము కొనుక్కున్నామని, చట్టబద్ధతమైన హక్కులు తమకే ఉన్నాయని, వీటితో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదంటూ హైకోర్టులో ఎస్బీఐ పిటిషన్ వేసింది. దీంతో మూడు వారాల పాటు తదుపరి చర్యలేవీ లేకుండా కోర్టు స్టే విధించింది. అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాల్సిందిగా విక్రయించిన టీజీఐఐసీకి, కొనుగోలు చేసిన ప్రైవేటు కంపెనీకి నోటీసులు జారీ అయ్యాయి.
ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే రాష్ట్ర ప్రభుత్వానికి ఊహించని షాక్ తగిలింది. విక్రయించిన భూముల్లో సర్వే నెం. 83/1లో కొంత భాగం వక్ఫ్ ఆస్తులంటూ జామియా నిజామియా అనే సంస్థ ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్, తహసీల్దార్‌కు లేఖలు రాసింది. ఇప్పటికే ఈ భూమికి సంబంధించిన సివిల్ రివిజన్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నదని, వేలం (Raidurgam Land Auction) ద్వారా విక్రయించడం ఆ ప్రక్రియను ఉల్లంఘించడమేనని ఆ లేఖలో పేర్కొన్నది.
‘ఉమీద్’ పోర్టల్‌లో నమోదు
రాయదుర్గం నాలెడ్జీ సిటీకి సమీపంలోని అత్యంత విలువైన భూముల్ని టీజీఐఐసీ ఇటీవల వేలం వేసిందని, మొత్తం రూ.1,490 కోట్ల విక్రయాలు జరిగాయని జామియా నిజామియా పేర్కొన్నది. అలా వేలం వేసిన భూమిలో కొంత భాగం వక్ఫ్ ఆస్తి అని, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వక్ఫ్ ఆస్తుల గుర్తింపు ప్రక్రియ మేరకు ‘ఉమీద్’ పోర్టల్‌లో ఆ భూమి వివరాలు ఉన్నాయని తెలిపింది. ఆ భూములకు ఆ పోర్టల్‌లో గుర్తింపు నెంబర్ (ఐడీ) కూడా లభించిందని పేర్కొన్నది.
– కేంద్ర ప్రభుత్వం 2025లో తీసుకొచ్చిన వక్ఫ్ చట్టం ప్రకారం వక్ఫ్ భూముల పరిశీలన జరిగిందని, రాయదుర్గంలోని సర్వే నెం. 83/1లోని కొంత భాగం వక్ఫ్ ఆస్తిగా నిర్ధారణ అయిందని, ఆ ధృవీకరణ తర్వాతనే ‘ఉమీద్’ పోర్టల్‌లో టీఎస్0518ఈ14ఆర్ఆర్22డీఏ001 అనే ఐడీ నెంబర్ కింద వివరాలన్నీ రిజిస్టర్ అయ్యాయని జామియా నిజామియా వివరించింది.
– టీజీఐఐసీ ఈ భూముల్ని వేలం నిర్వహించే ముందే ఈ భూమి వక్ఫ్ ఆస్తి అని తెలియజేస్తూ జిల్లా కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీఓ), తహసీల్దార్‌కు వినతిపత్రాలు సమర్పించినట్లు జామియా నిజామియా వివరించింది. అయినా రాష్ట్ర ప్రభుత్వంగానీ, మైనారిటీ సంక్షేమ శాఖ గానీ స్పందించలేదని, తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా వేలం ప్రక్రియను కొనసాగించాయని ఆరోపించింది.
– ఒకవైపు ఎస్బీఐతో వివాదం కొనసాగుతున్న సమయంలో జామియా నిజామియా సైతం అది వక్ఫ్ భూమి అనే కొత్త వాదనను తెరపైకి తేవడం మరో వివాదానికి దారితీసినట్లయింది.
Read Also: ‘రెడ్ జోన్’ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. ఈసారి వారికి టికెట్ డౌటే!
Follow Us On: X(Twitter)

