కలం, మెదక్ బ్యూరో: మెదక్ (Medak) జిల్లా చేగుంట (Chegunta) మండలం పొలంపల్లి వద్ద మెదక్-చేగుంట ప్రధాన రహదారిపై రైతులు ధర్నా (Farmers Protest) చేపట్టారు. తక్షణమే యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేశారు. యూరియా పంపిణీ కోసం ప్రవేశపెట్టిన నూతన యాప్ విధానంపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యల వల్ల యాప్ విధానంలో యూరియా పొందేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, పాత పద్ధతిలోనే నేరుగా యూరియాను అందజేయాలని డిమాండ్ చేశారు.
రైతుల ఆందోళన కారణంగా మెదక్-చేగుంట ప్రధాన రహదారిపై ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. యూరియా సరఫరా సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు.

