కలం, వెబ్ డెస్క్: ఏపీలో రాజకీయం తిరుమల లడ్డూ(Tirumala Laddu) చుట్టూనే తిరుగుతోంది. లడ్డూ కోసం వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని ఇటీవల సీబీఐ నివేదిక వెల్లడించింది. కానీ, నెయ్యి కల్తీ అయ్యిందని, నెయ్యిలో కెమికల్స్ వాడారని నివేదికలో పేర్కొంది. దీంతో వైసీపీ(YSRCP), కూటమి పార్టీల నేతల మధ్య పరస్పరం మాటల దాడి జరుగుతూనే ఉంది. నెయ్యిలో జంతువుల కొవ్వు లేకున్నా సీఎం చంద్రబాబు దుష్ప్రచారం చేశారని, ఆయన ప్రజలకు క్షమాపణలు చెప్పాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు వేంకటేశ్వర స్వామి ఆలయంలో పాప పరిహార పూజలు చేపట్టారు.
గుంటూరు జిల్లా గోరంట్లలో ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రత్యేక పూజలు చేశారు. కూటమి నేతలకు దేవుడు సద్భుద్ధి ప్రసాదించాలని వేడుకున్నట్లు తెలిపారు. చంద్రబాబు స్వార్థ రాజకీయాలతో వేంకటేశ్వర స్వామి లడ్డూపై హేయమైన వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. పిఠాపురంలోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ వంగా గీతా పూజలు చేశారు. లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని చంద్రబాబు, పవన్ కల్యాణ్ తప్పుడు ప్రచారం చేసి అపచారం చేశారని గీత పేర్కొన్నారు. అలాగే పులివెందుల, బద్వేల్, తిరుపతి, విశాఖ, తనుకు, నరసాపురం, పాణ్యం, బాపట్ల తదితర ప్రాంతాల్లో వైసీపీ నేతలు పాపపరిహార పూజల్లో పాల్గొన్నారు.


