కలం, వెబ్ డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu)కు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా విషెస్ చెప్పారు. చంద్రబాబు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ప్రధాని మోదీ (PM Modi) సైతం సీఎం చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయకత్వంలో అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సరికొత్త శిఖరాలకు చేరుతుందని తెలిపారు. ఈ మేరకు ఎక్స్ (X) వేదికగా ప్రధాని మోదీ మెసేజ్ పోస్టు చేశారు. “నా ఆప్తమిత్రుడు చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. ప్రజా సేవ కోసం చంద్రబాబుకు సంపూర్ణ ఆరోగ్యం కలగాలని కోరుకుంటున్నా” అని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుకు సతీమణి భువనేశ్వరి, పుత్రుడు నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర, జిల్లాల ముఖ్య నాయకులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సీఎం జన్మదిన సందర్భంగా నేడు అన్న క్యాంటీన్‌లో చంద్రబాబు దంపతులు అల్పాహారం చేయనున్నారు. విజయవాడ నగరంలోని పటమట అన్న క్యాంటీన్‌లో అల్పాహారం తీసుకోనున్నారు. ఆయన సతీమణి భువనేశ్వరి అన్న క్యాంటీన్‌ల ఒక రోజు ఖర్చు కోసం 76 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఈ విరాళం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో సోమవారం 3 పూటలా ఉచితంగా ఆహారం అందించనున్నారు. పటమట హైస్కూల్ రోడ్డులో రైతుబజార్ వద్దనున్న అన్న క్యాంటీన్‌లో సీఎంతో కలిసి భువనేశ్వరి అల్పాహారం చేయనున్నారు. అటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని అన్న క్యాంటీన్లలో జరిగే అన్నదాన కార్యక్రమంలో ఆయా ప్రాంతాల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పాల్గొననున్నారు.

