కలం, నల్లగొండ: దేశంలో రోజురోజుకూ నిరుద్యోగం పెరిగిపోవడంతో యువత తీవ్ర ఆక్రోశానికి గురవుతోందని, ఆ ఆగ్రహమే ఉద్యమాల వైపు అడుగులు వేయిస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం (Nellikanti Satyam) వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఇటీవల వేలాదిమంది యువత చేపట్టిన ‘చలో పార్లమెంట్’ నిరసన ప్రదర్శన దేశంలో పెల్లుబుకుతున్న తిరుగుబాటుకు నిదర్శనమని ఆయన అన్నారు.
మంగళవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఏఐవైఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. దేశ రాజకీయాలను శాసించే తిరుగులేని శక్తి ఒక్క యువతరానికి మాత్రమే ఉందని ఈ సందర్భంగా సత్యం గుర్తుచేశారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన గట్టిగా డిమాండ్ చేశారు. గతంలో రైలు ప్రమాదం జరిగితే నైతిక బాధ్యత వహిస్తూ నాటి రైల్వే మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, నేటి బీజేపీ పాలనలో రాజకీయ విలువలు పూర్తిగా విస్మరణకు గురయ్యాయని విమర్శించారు.
దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నా కేంద్ర మంత్రి రాజీనామా చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. యువత ఆగ్రహాన్ని పోలీసుల బలగాలతో అణచివేయాలని చూస్తే శ్రీలంక తరహా ప్రజా ఉద్యమం తప్పదని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని బీజేపీ ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, దేశంలో నిరుద్యోగ సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసి, శాఖల వారీగా ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. సమావేశంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. ధర్మేంద్ర మాట్లాడుతూ.. పోటీ పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. సెప్టెంబర్ 8, 9, 10 తేదీల్లో యాదగిరిగుట్టలో జరగనున్న ‘ఏఐవైఎఫ్ రాష్ట్ర మహాసభలను’ యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తీర్పారి వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షులు అన్నమల్ల నవీన్, కార్యదర్శి యషబోయిన మల్లేశం, గడ్డం నవీన్, బండారు శంకర్, జూలూరు వెంకటాచారి, దశరథ్, బాబి తదితర నాయకులు పాల్గొన్నారు.

