కలం, స్పోర్ట్స్ : ఎఫ్‌ఐహెచ్ హాకీ వరల్డ్ కప్-2026 (Hockey World Cup) కు భారత జట్టును ప్రకటించారు. 20 మంది సభ్యులతో కూడిన జట్టుకు హర్మన్‌ప్రీత్ సింగ్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆగస్టు 15 నుంచి 30 వరకు బెల్జియం, నెదర్లాండ్స్‌లో టోర్నీ జరగనుంది. అనుభవం, యువ ఆటగాళ్ల సమతుల్యతతో జట్టును ఎంపిక చేసినట్లు ప్రధాన కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ తెలిపాడు. పేరు చూసి కాదు.. ప్రదర్శన ఆధారంగానే ఆటగాళ్లను ఎంపిక చేసినట్లు వివరించాడు. గోల్‌కీపర్లుగా మోహిత్ హెచ్‌ఎస్, సూరజ్ కర్కేరా ఉన్నారు.
డిఫెన్స్‌లో హర్మన్‌ప్రీత్ సింగ్, అమిత్ రోహిదాస్, జర్మన్‌ప్రీత్ సింగ్, జుగ్‌రాజ్ సింగ్, సంజయ్, సుమిత్, యశ్‌దీప్ సివాచ్ చోటు దక్కించుకున్నారు. మిడ్‌ఫీల్డ్‌లో మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్‌తో పాటు నిలకంఠ శర్మ, రాజిందర్ సింగ్, ఆదిత్య అర్జున్ లలాగే ఉన్నారు. ఫార్వర్డ్ విభాగంలో మందీప్ సింగ్, దిల్‌ప్రీత్ సింగ్, అభిషేక్, సుఖ్‌జీత్ సింగ్, శిలానంద్ లక్రా ఎంపికయ్యారు. భారత్ పూల్-డీలో ఇంగ్లండ్, పాకిస్థాన్, వేల్స్‌తో కలిసి ఉంది. లీగ్ దశలోని అన్ని మ్యాచ్‌లు నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టెల్‌వీన్‌లో జరుగుతాయి.
భారత్ తొలి మ్యాచ్‌ను ఆగస్టు 15న వేల్స్‌తో ఆడనుంది. ఆగస్టు 17న ఇంగ్లండ్‌తో తలపడుతుంది. ఆగస్టు 19న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో కీలక పోరు ఉంటుంది. జట్టు ప్రతిరోజూ ఒకే ఆలోచనతో ముందుకెళ్తోందని ఫుల్టన్ తెలిపాడు. ఒక్కో మ్యాచ్‌పైనే పూర్తి దృష్టి పెట్టామని వివరించాడు. 1975 ప్రపంచకప్ విజయానికి 50 ఏళ్లు పూర్తవుతున్న వేళ.. ఈ జట్టు కూడా భారత హాకీ చరిత్రలో కొత్త అధ్యాయం రాసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు.

