కలం, మెట్‌పల్లి: ఎల్‌నినో (El Nino) ప్రభావం నేపథ్యంలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండి తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri) సూచించారు. మెట్‌పల్లి మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కోరుట్ల నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌లతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 35 శాతం వర్షపాతం లోటు నమోదైందని, భూగర్భ జలాలు కూడా వేగంగా తగ్గుతున్నాయని తెలిపారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ పరిస్థితులలో రైతులు సంప్రదాయ వరి సాగును తగ్గించి కందులు, పెసలు, మినుములు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, కూరగాయలు, ఉద్యాన పంటలు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. తక్కువ నీటితో సాగయ్యే పంటలను ఎంచుకోవడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు.
ప్రస్తుతం బోర్లలో నీరు ఉన్నప్పటికీ పంట చివరి దశ వరకు నీటి లభ్యత ఉండకపోవచ్చని, వరి సాగు చేస్తే రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని మంత్రి హెచ్చరించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, సాంకేతిక సలహాలు వ్యవసాయ శాఖ ద్వారా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఆయిల్‌పామ్ వంటి తక్కువ నీటితో సాగయ్యే పంటలపై కూడా రైతులు దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ప్రస్తుతం రాష్ట్రం సూపర్ ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాగునీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజగౌడ్, మెట్‌పల్లి ఆర్డీవో నరసింహరావు, మున్సిపల్ కమిషనర్‌లు, ఇరిగేషన్, మిషన్ భగీరథ, వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఏఈఓలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

