Mobile Popup Ad
Mobile Popup Ad

యాదగిరిగుట్టకు సీఎం.. సమస్యల స్వాగతం

కలం, నల్లగొండ బ్యూరో : తెలంగాణ దివ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక (CM Revanth Reddy Yadagirigutta Visit) నేపథ్యంలో.. కొండపై పాతుకుపోయిన దీర్ఘకాలిక సమస్యలు, అవినీతి అక్రమాలు ‘సమస్యల స్వాగతం’ పలికేందుకు సిద్ధమయ్యాయి. సీఎం రాక నేపథ్యంలో ఆలయ ప్రాంగణం రంగురంగుల విద్యుత్ దీపాలతో ముస్తాబవుతుండగా, లోపల మాత్రం ప్రసాదాల నాణ్యత లోపం, దుకాణాల కేటాయింపుల్లో గందరగోళం.. తదితరాలు ప్రతిష్టను మసకబారుస్తోంది. వందల కోట్ల ప్రజాధనంతో ఆలయాన్ని పునర్నిర్మించినా.. కొండపై కనీస సౌకర్యాలు కరవు కావడం.. లడ్డూ పోటులో ‘ఇంటి దొంగల’ లీలలు నిరంతరాయంగా సాగుతుండడంతో.. గతంలో జీడిపప్పు, చింతపండు స్వాహా చేసిన ‘ఇంటి దొంగల’ నెట్‌వర్క్ ఇప్పటికీ ఇక్కడ రాజ్యమేలుతుండగా.. ముఖ్యమంత్రి ఈ క్షేత్రస్థాయి వాస్తవాలపై ఎలాంటి కొరడా ఝుళిపిస్తారనేది చర్చనీయాంశంగా మారింది.

గాలికొదిలేసిన ప్రసాదాల నాణ్యత..

యాదగిరిగుట్ట అనగానే భక్తులకు మొదట గుర్తొచ్చేది స్వామివారి ప్రసాదం. కానీ, ఇటీవల ఇక్కడి ప్రసాదాల నాణ్యత దారుణంగా పడిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనుగోలు చేసే లడ్డూల బరువు, సైజు రోజురోజుకూ తగ్గిపోతోంది. తయారీలో వాడే దినుసుల్లో నాణ్యత లోపించింది. డబ్బులు మాత్రం కరెక్టుగా వసూలు చేస్తున్న అధికారులు.. నాణ్యత, బరువు విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారనేది మిస్టరీగా మారింది. స్వామివారి పులిహోర తింటే భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. కొన్నిసార్లు ఉప్పు ఉప్పుగా ఉండడం.. మరికొన్నిసార్లు అన్నం ఉడికి ఉడకకపోవడంతో భక్తులు నోట్లో పెట్టుకునే పరిస్థితి కూడా లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే.. గతంలో యాదగిరిగుట్ట ప్రసాద తయారీ కేంద్రంలో జరిగిన అవినీతి లీలలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. టన్నుల కొద్దీ చింతపండు స్వాహా కావడం.. స్వామివారి నైవేద్యానికి వాడాల్సిన జీడిపప్పును పక్కదారి పట్టించి సొంతానికి పకోడీలు వేసుకున్న ఉదంతాలు బయటపడ్డ సంగతి తెలిసిందే. ఇంత జరిగినా లడ్డూ పోటు (తయారీ కేంద్రం) లో ఇంటి దొంగల ఆటలు ఇంకా సాగుతూనే ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంతర్గత అవినీతి నెట్‌వర్క్‌కు అడ్డుకట్ట వేసే గట్టి చర్యలు ఇంతవరకు తీసుకోకపోవడం గమనార్హం.

క్యూలైన్లలో తాగునీటి తిప్పలు

యాదాద్రి క్షేత్రానికి వచ్చే ధర్మ దర్శనం క్యూలైన్లలో చిన్న పిల్లలతో వచ్చిన కుటుంబాలు నరకయాతన అనుభవిస్తున్నాయి. క్యూ కాంప్లెక్స్ నుంచి గోల్డ్ క్యూలైన్‌లోకి వచ్చే వరకు కనీసం తాగునీరు కూడా అందుబాటులో ఉంచకపోవడం గమనార్హం. రూ.150 క్యూలైన్, గోల్డ్ క్యూలైన్లలోని భక్తులకు మాత్రమే నీళ్లు సరఫరా చేస్తూ ఉచిత (ధర్మ) దర్శనం భక్తులను అధికారులు గాలికొదిలేశారు. ఉక్కపోత, దాహంతో అల్లాడిపోతున్న తమ చిన్నారులను చూసి తట్టుకోలేక, కొందరు తల్లిదండ్రులు తూర్పు రాజగోపురం వద్ద ఎస్పీఎఫ్, హోంగార్డు సిబ్బందిని బ్రతిమిలాడినా గేట్లు తీయడం లేదు. ఇలాంటి దారుణ పరిస్థితులను తట్టుకోలేక చాలామంది భక్తులు వైకుంఠద్వారం వద్దే స్వామివారికి మొక్కుకుని, దర్శనం చేసుకోకుండానే ఇండ్లకు తిరిగి వెళ్లిపోతున్న ఘటనలు ఇక్కడి దుస్థితికి అద్దం పడుతోంది.

మరోవైపు యాదాద్రిలో రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంలో ఆలయ అధికారులు, ఆర్టీసీ పూర్తిగా విఫలమవడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శని, ఆదివారాల్లో వేలాది మంది భక్తులు తరలివస్తుండగా, దానికి తగ్గట్టుగా కొండపైకి బస్సులు నడపడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారు. వీకెండ్ రద్దీ ఉన్నప్పటికీ కొండ కింద నుంచి పైకి కేవలం నాలుగు బస్సులను మాత్రమే నడిపిస్తున్నారంటే అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒక్కో బస్సులో 60 మంది వెళ్లాల్సి ఉండగా, 100 మందికి పైగా భక్తులను గొర్రెల మందలా ఎక్కిస్తున్నారు. సీట్ల కోసం నెట్టుకోవడమే కాకుండా, మహిళలు, వృద్ధులు ప్రాణాలకు తెగించి ఫుట్ బోర్డులపై వేలాడుతూ ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. గంటల తరబడి బస్సుల కోసం నిరీక్షించలేక చాలామంది మెట్ల మార్గాన్ని ఆశ్రయిస్తున్నారు.

ఏడాది కాలంగా హైడ్రాలిక్‌ లిప్టు పనిచేయట్లే..

దేవస్థాన పునర్నిర్మాణంలో భాగంగా యాదగిరిగుట్ట దేవస్థాన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అప్పటి సీఎం కేసీఆర్‌ లిప్టులను భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో పాటు స్వామివారి ఆరగింపు నైవేద్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకెళ్లేందుకు స్వామివారి ప్రధానాలయంలోని ప్రత్యేకంగా లిప్టును నిర్మించగా మహాకుంభ సంప్రోక్షణలో భాగంగా 2022 మార్చి 28న అందుబాటులోకి వచ్చింది. రామానూజ కూటమికి ఎదురుగానే ప్రత్యేకంగా సిద్ధం చేసిన హైడ్రాలిక్‌ లిప్టు గుండా నేరుగా స్వామివారి గర్భాలయం పక్కకు ప్రసాదాలు చేరుకుంటాయి. అక్కడి నుంచి భక్తులు తిరిగేందుకు తావులేని ప్రాంతం గుండా పది అడుగుల దూరంలో గర్బాలయంలోకి తీసుకెళ్లి స్వామివారికి ఆరగింపు సేవ చేపడతారు. స్వామివారి ఆరగింపు శాస్త్రబద్ధంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా, సరైన సమయంలోనే పూర్తి చేస్తారు.

ఈ లిప్టును కేవలం అర్చకులు, స్వామివారికి వినియోగించే అరగింపు ప్రసాదాలను తరలించేందుకు మాత్రమే వినియోగిస్తున్నారు. అయితే ఈ లిఫ్టు ఏడాది కాలంగా పనిచేయడం లేదు. దీంతో అర్చకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి కాలంలో మండుటెండలో దాదాపు 10 నుంచి 15 కిలోల బరువులతో మెట్లు దిగడం అర్చకులకు తలకుమించిన భారంగా మారింది. అర్చకుల ఇబ్బందులను చూసి భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికాలంగా ఈ సమస్య ఉన్నా ఇటీవల ఈ సమస్య మరింత తీవ్రమైందని, దేవస్థానం అధికారులు స్పందించకపోవడం తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నైవేద్యాల తరలింపులో జాప్యం జరిగితే.. ఆలయ దైనందిన కైంకర్యాలు, పూజా కార్యక్రమాల సమయపాలన గాడి తప్పుతున్నాయని భక్తులు ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజూ వేలాది మంది భక్తుల వచ్చే ఇంత పెద్ద ఆలయంలో స్వామి వారికి అందజేసే నైవేద్యం తీసుకెళ్లే లిప్టుకు మరమ్మతులు చేయించలేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని స్థానికులు వాపోతున్నారు.

ప్రసాద విక్రయశాలలో నరకం.. ప్లానింగ్ లేని కౌంటర్లు..

స్వామివారి దర్శనం కోసం 4 గంటలు క్యూలైన్లలో నిలబడిన భక్తులకు, ప్రసాదం కోసం మరో పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తోంది. ప్రసాదం కౌంటర్ ఆఖండ దీపం పక్కన పెట్టడంతో భక్తులు అక్కడ టికెట్ కొని, మళ్లీ ప్రసాద విక్రయశాల వద్ద గంటల కొద్దీ లైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. రెండు కౌంటర్లు పక్కపక్కనే పెడితే ఈ తిప్పలు తప్పేవని మహిళా భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రసాదం సెక్షన్ వద్ద ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు లేకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరోవైపు కొండపై టాయిలెట్లు, పారిశుధ్య సమస్యలు మరీ దారుణంగా తయారయ్యాయి. భక్తుల రద్దీకి తగ్గట్టుగా టాయిలెట్లు లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్న వసతి గృహాలు, క్యూలైన్ల వద్ద కూడా సరైన పారిశుధ్య నిర్వహణ లేకపోవడంతో క్షేత్రమంతా దుర్వాసన వెదజల్లుతోంది. యాదాద్రిలో మౌలిక వసతుల లేమి, భక్తుల అవస్థలపై ప్రజా సంఘాల ఆందోళనల నేపథ్యంలో ఇటీవల లోకాయుక్త సుమోటోగా విచారణ చేపట్టింది. ఆలయ అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ఇప్పటికే నోటీసులు జారీ చేసింది. యాదాద్రిని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రచారం చేసుకుంటున్నారే తప్ప, కనీసం భక్తులకు తాగునీరు, టాయిలెట్లు, రవాణా సౌకర్యాలు కల్పించడంలో దేవాదాయ శాఖ, స్థానిక ఆలయ అధికారులు ఘోరంగా విఫలమవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, బస్సుల సంఖ్యను పెంచడంతో పాటు క్యూలైన్లలో తాగునీటి సదుపాయం, వృద్ధులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>