కలం, ఆదిలాబాద్ బ్యూరో: ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలోని ఆదివాసీ గూడేల (Tribal Hamlets)ను పర్యాటక కేంద్రాలుగా మార్చేందుకు అటవీ, పర్యాటక శాఖల అధికారులు సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. అడవి బిడ్డల ఘన చరిత్రను, వారి విలక్షణమైన ఆచార సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. ఒకవైపు భూతల స్వర్గాన్ని తలపించే ప్రకృతి అందాలు, మరోవైపు పర్యాటకులను కట్టిపడేసే గిరిజన సంస్కృతికి కేరాఫ్ అడ్రస్‌గా మారబోతున్న ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంతాలపై ప్రత్యేక కథనం…
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా… ఈ అడవుల్లో ఆదివాసీ బిడ్డలు వందల ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. సుందరమైన ప్రాంతంలో కొండలు, కోనలతో పాటు జలజలా ప్రవాహించే నదులు ఉన్నాయి.., పరవళ్లు తొక్కే సేలయేళ్లున్నాయి… అంతేకాదు, ఆకాశం నుండి జాలు వారే ఎన్నో జలపాతాలూ ఉన్నాయి. కుంటాల, గాయత్రి, ఖండాల వంటివి అందరికీ తెలిసినవే. ఈ ప్రకృతి సోయగాలు, అడవుల అందాల మధ్య ఆదివాసీ బిడ్డల జీవనం చూస్తే స్వర్గమే భువికి దిగినవచ్చిందా అన్న అనుభూతి కలుగుతుంది. ఈ అందాలకు తోడు ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు చూడముచ్చటగా ఉంటాయి. ఆదివాసీ బిడ్డల పండుగలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. దండారి ఉత్సవాలు, పేర్సాపేన్ ఉత్సవాల్లో అచారాలు, సంప్రదాయాలు పాటిస్తూ జరుపుకొంటారు. ఒకవైపు ప్రకృతి అందాలు, మరోవైపు ఆదివాసీ ఆచారాలు, పండుగలు చూడటానికి గూడేలను పర్యాటక కేంద్రాలుగా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ రాజర్షిషా వెల్లడించారు.
పూర్తయిన గూడేల ఎంపిక
ఒక రోజు పర్యాటకులకు గూడేల్లో ఆతిథ్యం ఇచ్చేలా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీలను ప్రదర్శిస్తామన్నారు. అదేవిధంగా గిరిజన బిడ్డల ఆచారాలు, సంప్రదాయాలు చూస్తే పర్యాటకులు ముగ్దులవుతారంటున్నారు. ఇప్పటికే సిరికొండ, ఇంద్రవెల్లి, ఉట్నూర్ మండలాల్లో గూడేలను అధికారులు ఎంపిక చేశారు. త్వరలో ఆదివాసీ బిడ్డల చరిత్ర అందరికీ తెలిసేలా ఆదివాసీ టూరిజం ప్రారంభిస్తామంటున్నారు. దీని వల్ల ఎన్నో ప్రయోజాలు ఉన్నాయని కలెక్టర్ చెప్తున్నారు. ఆదివాసీ చేతి ఉత్పత్తులకు మంచి మార్కెట్ లభిస్తుందని వెల్లడంచారు. ఆదివాసీ రాజుల కట్టడాలు, వాయిద్యాలు, కళలు, ఆటలు, పాటలు అందరికీ తెలుస్తాయని చెప్పారు. ఆదివాసీ టూరిజంలో ఆదివాసీల వంటకాలను పర్యాటకులకు అందిస్తామంటున్నారు. ఇలాంటి వాటి వల్ల ఉపాధి, ఉద్యోగాలు లభిస్తాయని అధికారులు చెప్తున్నారు.
ఆదివాసీల్లో వెల్లివిరిస్తున్న ఆనందం
ఆదివాసీ గూడేలను పర్యాటక కేంద్రాలుగా ఏర్పాటు చేయడం పట్ల గిరిజనులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ పండుగలు, కళలు ఇతరులు చూడటం వల్ల తమకు గుర్తింపు లభిస్తుందని చెప్తున్నారు. దీన్ని ఆదివాసీ చరిత్ర, వారసత్వ సంపదకు దక్కిన గౌరవంగా భావిస్తామంటున్నారు. తమ రాజులు పాలించిన కేంద్రాలు, నిర్మించిన కట్టడాలకు ఒక గుర్తింపు లభిస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎకో టూరిజం తమకు మేలు చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. పర్యాటకుల రాకతో రకరకాల ఉపాధి అవకాశాలు లభిస్తాయని, దీంతో ఆర్థికంగా అభివృద్ధి చెందొచ్చని చెప్తున్నారు. అదేవిధంగా చదువుకున్న వారికి పర్యాటక రంగంలో ఉద్యోగాలు దక్కే అవకాశాలున్నాయని చెప్పారు. గూడెం టూరిజం తమ జీవితాలను మార్చుతుందని ఆదివాసీలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

