యాదాద్రి పవర్ ప్లాంట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత.. బీఆర్ఎస్ నేతల ఫైర్

కలం, నల్లగొండ బ్యూరో: నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని వీర్లపాలెం వద్ద ఉన్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (Yadadri Thermal Power Plant) వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్లాంట్‌లో రెండు యూనిట్లు హఠాత్తుగా షట్‌డౌన్ కావడం, విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంపై నిజనిజాలు తేల్చేందుకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు బయలుదేరిన నిజనిర్ధారణ కమిటీని పోలీసులు అడ్డుకోవడంతో రాజకీయం తీవ్ర రూపం దాల్చింది.

మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి నాయకత్వంలో మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు, మిర్యాలగూడ బిఆర్ఎస్ శ్రేణులు, భారీ సంఖ్యలో కార్యకర్తలు ప్లాంట్ సందర్శనకు తరలివచ్చారు. అయితే పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా ప్లాంట్‌కు దూరంగానే బారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా బందోబస్తు మోహరించారు.

తోపులాట.. తీవ్ర వాగ్వాదం..

ప్లాంట్ లోపలికి వెళ్లేందుకు యత్నించిన బిఆర్ఎస్ నేతలను పోలీసులు బారికేడ్ల వద్దే నిలిపివేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఇతర నేతలు బారికేడ్లను, గేట్లను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో బిఆర్ఎస్ శ్రేణులకు, పోలీసులకు మధ్య తీవ్ర తోపులాట, వాగ్వాదం చోటుచేసుకున్నాయి.

ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని నడపడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్లాంట్‌లో బొగ్గు కొరత వల్ల రెండు యూనిట్లు నిలిచిపోవడానికి కారణమేంటో అధికారులను నేరుగా అడిగి తెలుసుకునేందుకే తాము వచ్చామని, తమను అడ్డుకోవడం వెనుక ప్రభుత్వ భయం కనిపిస్తోందని విమర్శించారు.

ఇప్పటికే ప్రభుత్వం చర్యలు..

మరోవైపు ప్లాంట్‌లో బొగ్గు సరఫరా సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికే ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. బొగ్గు కొరత తలెత్తకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరా పునరుద్ధరించి, రాబోయే దసరా పండుగ నాటికి యాదాద్రి ప్లాంట్‌ను పూర్తి సామర్థ్యంతో నడిపించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించినట్లు సమాచారం. గురువారం రాత్రి నుంచి ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తున్నప్పటికీ, బిఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలిరావడం, మరోవైపు పోలీసులు మోహరించడంతో యాదాద్రి ప్లాంట్ పరిసరాల్లో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>