కేటీఆర్ మాస్టర్ ప్లాన్.. ‘దీక్ష దివస్’తో కాంగ్రెస్‌కు చెక్!

కలం, తెలంగాణ బ్యూరో: అధికార పార్టీపై పోరుకు గులాబీ పార్టీ సిద్ధమవుతున్నది. ఇందుకోసం ఎల్ నినో, తాగు, సాగు నీరు, రైతుల ఇబ్బందులనే ప్రధాన అంశాలుగా ఎంచుకున్నది. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ వద్ద నీటి లభ్యత సరిపడేంత ఉన్నా.. తమపై అక్కసుతోనే సర్కార్ నీటిని ఎత్తిపోయడం లేదని, ఇదే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తున్నది. క్షేత్ర స్థాయిలో పర్యటించి నీటి లభ్యత గురించి ప్రజలకు వివరించాలని, ఆధారాలు చూపిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరును ప్రజల ముందు ఎండగట్టి, దోషిగా నిలబెట్టేలా వ్యూహాలు రచిస్తున్నది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బస్సు యాత్ర (KTR Bus Yatra) చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

ఈ నెల 11 నుంచి యాత్ర

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ నెల 11 నుంచి 14 తేదీల మధ్యలో రెండు రోజుల పాటు బస్సు యాత్ర చేపట్టనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో నిర్మించిన మేడిగడ్డతో పాటు గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ప్రాజెక్టుపై ప్రజలకు ఉన్న అనుమానాలను తొలగించి, నీటి లభ్యత ఎంత మేరకు ఉన్నది? ఎంత నీటిని ఎత్తిపోయచ్చు? దిగువకు వృథాగా పోతున్న నీరెంత? నీటిని ఒడిసిపట్టకపోవడానికి గల కారణాలపై ప్రజలకు స్పష్టమైన ఆధారాలతో చూపించాలని భావిస్తున్నారు. చిన్నపాటి పిల్లర్ల కుంగుబాటును సాకుగా చూపించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నీటిని ఎత్తిపోయడం లేదనే విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి వివరిద్దామని ఆలోచిస్తున్నారు. దీని కోసం పార్టీ నాయకులతో కలిసి ప్రణాళికలు రచిస్తున్నారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన బీఆర్ఎస్పై వ్యతిరేకతను తొలగించుకోవచ్చని భావిస్తున్నారు. అలాగే సాగు, తాగునీరు, విద్యుత్ సమస్యలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఇబ్బందులను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఆయా ప్రాంతాల్లో నీరందక ఎండిపోయిన వరి పొలాలు, ఆయకట్టు ప్రాంతాలను సైతం పరిశీలించనున్నారు.

అలుగునూరులో ‘దీక్ష దివస్’

నాడు ఉద్యమ సమయంలో ఆమరణ నిరాహార దీక్షకు వెళ్తున్న కేసీఆర్ను పోలీసులు అలుగునూర్లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అదే అలుగునూరు, సమీప ఏరియాల్లో ఈ నెల 29న ‘దీక్ష దివస్’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున జనాలను సమీకరించాలని పార్టీ శ్రేణులు కసరత్తులు చేస్తున్నారు. జన సమీకరణతో సత్తాచాటి, కేడర్లో జోష్ నింపాలని ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తయ్యాయి. మరో రెండేళ్లలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తున్నారు. కాగా, కేటీఆర్ పాదయాత్ర కూడా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఒకవేళ పాదయాత్ర చేస్తే దానికి ముందస్తుగా ఈ బస్సు యాత్ర ట్రయల్ రన్ మాదిరిగా యూజ్ అవుతుందని కార్యకర్తలు నమ్ముతున్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ

సీఎం రేవంత్ రెడ్డి గురువారం జరిగిన కేబినెట్ భేటీలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని మంత్రులకు గట్టిగా హితబోధ చేశారు. క్షేత్రస్థాయిలో వెళ్లి ప్రజలకు వాస్తవాలు వివరించాలని సూచించారు. ఇది ఎల్ నినో తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరవంటూ ఆ పార్టీ అగ్ర నాయకులు కేటీఆర్, హరీశ్ రావు వంటి నేతల అసత్యాలకు అదే స్థాయిలో కౌంటర్ ఇవ్వాలని చెప్పారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఫీల్డ్ విజిట్‌కు వెళ్లే అవకాశమున్నది. రెండు పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని నిర్ణయానికి రావడంతో ప్రాధాన్యం సంతరించుకున్నది. మేడిగడ్డ వద్ద నీటి లభ్యతపై ఏ పార్టీ నాయకులు ఏం చెబుతారు? ప్రజలు ఎవరిని విశ్వసిస్తారు? అనేది ఆసక్తిగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>