కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (KDCCB Karimnagar) చుట్టూ ఇప్పుడు రాజకీయ, చట్టపరమైన వివాదం చర్చనీయాంశంగా మారింది. 2005 నుంచి వరుసగా కేడీసీసీబీ చైర్మన్‌గా కొనసాగుతున్న కొండూరు రవీందర్ రావు స్థానానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తుండగా, మరోవైపు చట్టపరమైన ఉత్తర్వుల ఆధారంగా ఆయన తిరిగి బాధ్యతలు స్వీకరించడం వివాదానికి దారితీసింది.
అసలు ఏం జరిగింది?
బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2020 ఫిబ్రవరి 15న సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. నాటి నుంచి కేడీసీసీబీ చైర్మన్‌గా కొండూరు రవీందర్ రావు కొనసాగుతున్నారు. కేడీసీసీబీ (KDCCB) పరిధిలో మొత్తం 131 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (PACS) ఉన్నాయి. సహకార సంఘాల ఐదేళ్ల పదవీకాలం 2025 ఫిబ్రవరితో ముగిసింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడువు పొడిగించకుండా, 2025 డిసెంబర్ 19న పీఏసీఎస్, డిసిసిబి పాలకవర్గాలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కలెక్టర్లను పర్సన్ ఇన్ చార్జీలుగా నియమించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ పాత పాలకవర్గాలు కోర్టును ఆశ్రయించాయి. దాంతో హైకోర్టు జిఓ 598ని కొట్టివేసి, పాత జీవో 386 ప్రకారం పాత పాలకవర్గాలను కొనసాగించాలని ఆదేశిస్తూ స్టే ఇచ్చింది.
ఆదేశాలు లేవు.. బాధ్యతలేలా?
కోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఈ నెల 21న కొండూరు రవీందర్ రావు కేడీసీసీబీ పీఐసీగా తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం, సహకార శాఖ నుంచి ఎలాంటి అధికారిక ఆదేశాలు లేకుండానే బాధ్యతలు స్వీకరించడంపై జిల్లా సహకార శాఖ అధికారులు, కలెక్టర్ చిత్రా మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశారు.
కేసు నమోదుకు దిశగా చర్యలు
జీవో ఆదేశాలు లేకుండా బాధ్యతలు స్వీకరించడంపై డిసీవో రామానుజాచార్యులు ఆదేశాల మేరకు, కేడీసీసీబీ సీఈవో సత్యనారాయణరావును పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించినట్లు సమాచారం. లిఖితపూర్వక ఆదేశాలు రాగానే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని సీఈవో చెబుతున్నారు.
”నామినేటెడ్ నియామకాలతో” కొండూరుకు ప్రభుత్వ చెక్?
ప్రభుత్వం నామినేటెడ్ పద్ధతిలో పీఏసీఎస్‌లకు నూతన పాలకవర్గాలను ప్రకటిస్తూ వస్తోంది. కేడీసీసీబీ చైర్మన్ పదవిలో కొనసాగాలంటే అభ్యర్థి పీఏసీఎస్ చైర్మన్‌గా ఉండటం తప్పనిసరి. అయితే తాజాగా గంబీరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్) చైర్మన్‌గా వేషాల వెంకట్ ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్యాక్స్ చైర్మన్ హోదా లేకపోతే కేడీసీసీబీ చైర్మన్ పీఠం దక్కదు కాబట్టి, ఈ నామినేటెడ్ నియామకంతో కొండూరు రవీందర్ రావుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా చెక్ పెట్టిందని సహకార వర్గాలు భావిస్తున్నాయి.
స్తంభించిన బ్యాంకింగ్..
కేడీసీసీబీలో మే 12 నుంచి రూ. 10 లక్షలకు మించి రుణాలు మంజూరు చేయడం లేదు. రూ. 10 లక్షలు దాటితే కలెక్టర్ ఆమోదం లభించకపోవడంతో వ్యవసాయ, వ్యాపార, విద్య రుణాలు పూర్తిగా స్తంభించిపోయాయి.
పిఎసిఎస్ లపై ఎన్నికలపై ఉత్కంఠ.. రైతుల ఆందోళన
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) పాలకవర్గాల కొనసాగింపు, ఎన్నికల ప్రక్రియపై తీవ్ర అనిశ్చితి, ఉత్కంఠ కొనసాగుతోంది. హైకోర్టు స్టే ఉత్తర్వుల నేపథ్యంలో పాత పాలకవర్గాలే కొనసాగుతున్నాయా లేదా అనే అంశంపై స్పష్టత లేకపోవడంతో రైతుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పీఏసీఎస్‌లకు ప్రత్యక్ష ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో సహకార సంఘాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
ఎన్నికల నిర్వహణ ఆలస్యమైతే రైతులకు అందాల్సిన రాయితీలు, రుణాలు, ఇతర సంక్షేమ పథకాల అమలుపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం త్వరగా స్పందించి స్పష్టత ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు సీనియర్ పాలకవర్గాలు – ప్రభుత్వ నిర్ణయాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనడంతో రైతులకు అందాల్సిన రాయితీలు, సంక్షేమ పథకాల అమలుపై తీవ్ర ప్రభావం పడుతోంది. కేడీసీసీబీ చైర్మన్‌గా తిరిగి బాధ్యతలు స్వీకరించిన కొండూరు వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేస్తారా? లేక ప్రభుత్వ నామినేటెడ్ నియామకాలతో ఈ వివాదం సద్దుమణుగుతుందా అనేది వేచి చూడాలి.

