కలం, సోన్ : సోన్ మండల (Soan Mandal) కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించాల్సిన మండల స్థాయి అభివృద్ధి సమీక్ష సమావేశాన్ని పలువురు కాంగ్రెస్ సర్పంచులు (Congress Sarpanches) బహిష్కరించారు. సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, ముఖ్యఅతిథిగా హాజరుకావాల్సిన నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆలస్యంగా రావడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. మండల స్థాయి అభివృద్ధి సమావేశం నిర్వహణపై ఎంపీడీవో ఆయా గ్రామాల సర్పంచులకు సమాచారం ఇవ్వడంతో సర్పంచులు నిర్ణీత సమయానికి సమావేశ మందిరానికి చేరుకున్నారు.
అయితే ఎమ్మెల్యే ఆలస్యంగా రావడంతో ప్రజాప్రతినిధులు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని కాంగ్రెస్ సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సిద్ధిలకుంట, గంజాల్, కడ్తాల్ సర్పంచ్ లు సతీష్ రెడ్డి, వెంకటరమణ, గుర్రం రాము సమావేశాన్ని బహిష్కరించి బయటకు వచ్చారు. వీరితో పాటు నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ రామ్‌రెడ్డి, మంజులాపూర్ పీఏసీఎస్ చైర్మన్ అంపోలి కృష్ణ ప్రసాద్ రెడ్డి కూడా సమావేశాన్ని బహిష్కరించారు. అధికారిక సమావేశాలకు ఎమ్మెల్యే కోసం సర్పంచులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి రావడం సరికాదన్నారు. సమయపాలన పాటించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు.

