కళ్ల ముందే మునిగిన పంట.. ఖమ్మం రైతులకు గుండెకోత!

కలం, ఖమ్మం బ్యూరో: ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో అన్నదాతల పరిస్థితి ఆగమాగంగా మారింది. రైతుల్లో ఆవేదనను, కన్నీళ్లను మిగులుస్తున్నది. ఎల్ నినో ప్రభావంతో సాగునీరు అందక.. ఇప్పుడు వరుస తుపానులు దెబ్బకొట్టాయి. కొద్ది రోజుల ఉమ్మడి జిల్లాను వణికించిన అర్నబ్ తుఫాన్ బీభత్సంతో జిల్లావ్యాప్తంగా సుమారు 1,138 ఎకరాల్లో వరి నేల కూలింది. దాని నుంచి రైతులు కోలుకోకముందే తాజాగా మురసు తుపాను వచ్చి నిండా ముంచింది. పెట్టుబడులకు వడ్డీ వ్యాపారులు, బ్యాంకుల్లో తెచ్చిన అప్పులు ఒకవైపు.. ఆరుగాలం కష్టపడి పెంచిన పంటలను అకాల వర్షాలు కళ్ల ముందే ముంచేయడంతో రైతులకు గుండె కోతే మిగిలింది.

పత్తి పంట రంగుమారి నల్లబారిపోయింది. కనీస గిట్టుబాటు ధర కూడా దక్కదని పరిస్థితి ఉంది. మరోవైపు కోత దశకు చేరిన వరి పొలాల్లో వాననీరు నిలిచిపోవడంతో గింజలు తడిసి మొలకెత్తే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే వరిని కోసి వడ్లను రాశులుగా పోయగా.. వానలకు తడిసి ముద్దవుతుండటం చూసి రైతులు ఆందోళనలో పడ్డారు. పంటను కాపాడుకోవడానికి పడిన శ్రమంతా వృథా అయిందని, నాలుగు లక్షల పెట్టుబడి పెట్టి నాలుగు ఎకరాల్లో మిరపతోట వేస్తే తెగులు సోకిందని మధిరకు చెందిన మందడపు నాగకృష్ణ ఆవేదనతో చెప్పారు. అప్పుల భారం ఒకవైపు, ప్రకృతి వైపరీత్యాలు మరోవైపు ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా.. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు.

జల దిగ్బంధంలో మూడు మండలాలు

మరోవైపు మురుసు తుపానుతో భద్రాద్రి జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి మండలాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. చంద్రుగొండ మండలంలో సీతాయిగూడెం వెళ్లే ప్రధాన మార్గంలో వంతెనపైకి భారీగా వరదనీరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో అధికారులు రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ములకలపల్లి మండలం రాజుపేట వద్ద పాములేరు వాగు ఉధృతికి తాత్కాలిక రహదారి కొట్టుకుపోవడంతో పాల్వంచ – దమ్మపేట మధ్య రాకపోకలు నిలిచాయి. అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో, రింగ్ బండ్ తెగిపోవడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అధికారులు అప్రమత్తమై 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>