సిద్ధిపేట వేదికగా సీఎం రేవంత్ ప్లాన్.. హరీశ్‌ రావుకు చెక్!?

కలం, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్‌కు, హరీశ్‌రావుకు (Harish Rao) కంచుకోటా భావిస్తున్న సిద్దిపేటపై సీఎం రేవంత్‌రెడ్డి ఫోకస్ పెట్టారు. నకిరేకల్‌లో సెప్టెంబర్ 5న ప్రకటించినట్లుగానే సిరిసిల్లలో సెప్టెంబర్ 30న బహిరంగ సభ నిర్వహించిన సీఎం.. ఈ నెల 19న సిద్దిపేటకు వెళ్తున్నారు. 2 స్కీమ్‌లను లాంచ్ చేయడానికి సిద్దిపేటను వేదికగా ఎంచుకుని పొలిటికల్‌గానూ హరీశ్‌రావు, కేసీఆర్‌కు సవాల్ విసిరే అవకాశమున్నది. మల్లన్న సాగర్ నిర్మాణం సమయంలో హరీశ్‌రావు కొనుగోలు చేసిన రైతుల భూములు, ఆయన మామ హన్మంతరావు పేరు మీద జరిగిన రిజిస్ట్రేషన్లు, కొండపోచమ్మ సాగర్ నుంచి పాండురంగ చెరువు ద్వారా కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌లోకి పైప్‌లైన్ కనెక్షన్.. ఇలాంటి పలు అంశాలను సీఎం రేవంత్ ప్రస్తావించే చాన్స్ ఉంది.

ఒకవైపు అఫీషియల్ ప్రోగ్రామ్, మరోవైపు పొలిటికల్ విమర్శలు చేసే వేదికగా సిద్దిపేట సభ మారనున్నది. ఇందిరమ్మ చీరల పంపిణీ, ఇందిరమ్మ జీవిత బీమా స్కీమ్‌ల ప్రారంభోత్సవానికి ప్రొటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యేగా హరీశ్‌రావు హాజరవుతారా? సీఎంతో పాటు ఆ వేదికపై కనిపిస్తారా? ఇలాంటి చర్చలు మొదలయ్యాయి.

కాళేశ్వరంతో లింక్ పెట్టి విమర్శలు!

అధికారికంగా రెండు స్కీమ్‌లను లాంచ్ చేయడానికి ఎంచుకున్న సిద్దిపేట వేదిక కానుంది. అయితే ఈ వేదికను పొలిటికల్‌గా కేసీఆర్, హరీశ్‌ రావుకు స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడానికి సైతం సీఎం రేవంత్ ఉపయోగించుకునే అవకాశమున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు ఎప్పటికైనా జీవనాడి, ప్రాణధార అని హరీశ్‌రావు పదేపదే వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టులోని వైఫల్యాలను మూడు బ్యారేజీల అంశాన్ని ప్రస్తావించి ఇద్దరినీ టార్గెట్ చేసే చాన్స్ ఉంది. కొండపోచమ్మ సాగర్, పాండురంగ చెరువు, ఎర్రవల్లి ఫామ్ హౌజ్‌కు ప్రత్యేక పైప్‌లైన్ నిర్మాణం తదితరాలను కూడా సీఎం ప్రస్తావించి ఆ జిల్లా ప్రజలకు సరికొత్త మెసేజ్ పంపాలని భావిస్తున్నట్లు తెలిసింది.

రామలింగారెడ్డి ఫిర్యాదు ప్రస్తావనతో బీఆర్ఎస్‌పై గురి

ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌజ్ గురించి అసెంబ్లీ వేదికగా కామెంట్లు చేసిన నేపథ్యంలో రెవెన్యూ అధికారుల సర్వేలో వెల్లడైన అంశాలు, 45 ఎకరాలు మిస్సింగ్ కావడం, దళితులు డప్పు దండోరా కార్యక్రమం తర్వాత పసుపునీళ్లతో రోడ్లను శుభ్రం చేయడం.. ఇలాంటివన్నీ సీఎం ప్రసంగంలో చోటుచేసుకునే అవకాశమున్నది. హరీశ్‌రావును టార్గెట్ చేస్తూ ఇప్పటికే కొన్ని అంశాలను సీఎం రేవంత్ రెడ్డి తెరమీదకు తెచ్చారు. ఆయన మామ హన్మంతరావు భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారం వీటిల్లో ఒకటి. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టు భూసేకరణ వ్యవహారం, రైతులకు జరిగిన అన్యాయం, భూసేకరణలో చోటుచేసుకున్న అక్రమాల ఆరోపణలు, గతంలో వచ్చిన ఫిర్యాదులు… ఇవన్నీ సీఎం రేవంత్‌రెడ్డి సిద్దిపేట సభలో ప్రస్తావించే అవకాశాలున్నట్లు సమాచారం.

దివంగత మాజీ ఎమ్మెల్యే (దుబ్బాక) సొలిపేట రామలింగారెడ్డి గతంలో చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏటిగడ్డ కిష్టాపూర్‌, పల్లెపహాడ్‌, రాంపూర్‌, తుక్కాపూర్‌ గ్రామాల్లో భూసేకరణ వ్యవహారాన్ని సీఎం మరోసారి లేవనెత్తే అవకాశమున్నది. రంగనాయకసాగర్‌ పక్కన రామంచలో హరీశ్‌రావు, ఆయన కుటుంబ సభ్యులు, అనుచరులకు సంబంధించిన భూముల అంశం గురించి సూచనప్రాయంగా ప్రస్తావించిన అంశాలను వివరాలతో సహా ఈ సభ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తున్నది. సిరిసిల్ల సభలో కేటీఆర్ టార్గెట్‌గా చేనేతకారుల అంశాన్ని ప్రస్తావించగా, సిద్దిపేట్ సభలో మాత్రం ఇరిగేషన్ అంశంపైన సీఎం ఎక్కువ ఫోకస్ పెట్టే చాన్స్ ఉంది.

హైకోర్టును ఆశ్రయించే అంశాన్నీ ప్రస్తావిస్తారా!?

సిద్దిపేట్ జిల్లా కొండపాక మండలం వెలికట్టలో (సర్వే నంబర్ 271) సుమారు 300 ఎకరాల పరిధిలో లావుణి పట్టాలు ఉన్నాయని, మాజీ సైనికులు, స్వాతంత్ర్య సమరయోధులకు కేటాయించిన భూములేనని, నిబంధనలకు విరుద్ధంగా కొందరికి బదిలీ అయ్యాయనే ఆరోపణలున్నాయి. హరీశ్‌రావు మామ మాధవరం హన్మంతరావు పేరుతో 6.18 ఎకరాల భూమి రిజిస్టర్‌ అయిందని, అనుమతుల మంజూరులో అక్రమాలు జరిగాయని, అధికార దుర్వినియోగం జరిగిందంటూ ఇప్పటికే కాంగ్రెస్‌ నేతలు ఆరోపించారు. వీటిని హరీశ్‌రావు ఖండించారు. సుమారు 13.12 ఎకరాల వ్యవసాయ భూమిని 2018-24 మధ్య దశలవారీగా కొనుగోలు చేశానని, ఈ ఆస్తుల వివరాలన్నీ ఎన్నికల అఫిడవిట్లలోనే వెల్లడించానని హరీశ్‌రావు వివరణ ఇచ్చారు. హన్మంతరావుకు సంబంధించిన వెలికట్ట భూములపై సెప్టెంబర్ చివరి వారంలో రెవెన్యూ అధికారులు షోకాజ్‌ నోటీసు జారీ చేయగా, దాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించిన విషయాన్ని సీఎం ప్రస్తావించే అవకాశమున్నది. కోర్టు పరిధిలో ఉన్న ఈ వ్యవహారంపై సీఎం ఎలా ప్రస్తావిస్తారన్నది కీలకంగా మారింది. సబ్‌జ్యుడిస్ మేటర్‌గా ఉన్నందున సీఎం ఏ రూపంలో ఎలాంటి కొత్త అంశాలను తెరమీదకు తెస్తారన్నది ఆసక్తికరం.

సీఎంతో హరీశ్‌ వేదికపై కనిపిస్తారా?

సీఎం రేవంత్ పర్యనటలో భాగంగా రెండు కొత్త స్కీమ్‌లను లాంచ్ చేసే వేదికగా సిద్దిపేట సభ ఉంటున్నందున ప్రొటోకాల్ ప్రకారం హరీశ్‌రావు హాజరవుతారా? లేక దూరంగా ఉంటారన్న ఆసక్తికర చర్చ కూడా జిల్లాలో మొదలైంది. ఒకవైపు అధికారిక కార్యక్రమం అయినందున హాజరు కావడం స్థానిక ఎమ్మెల్యేగా హరీశ్‌రావుకు అన్ని అవకాశాలూ ఉన్నాయి. అదే సమయంలో పొలిటికల్ విమర్శలతో టార్గెట్ చేసే అవకాశం ఉన్నందున వేదికపై ఉంటే అవమానం తప్పదని గైర్హాజరవుతారా.. అనే చర్చ కూడా జిల్లా ప్రజల్లో మొదలైంది. హాజరుకాకపోతే కాంగ్రెస్ దీన్ని రాజకీయంగా వాడుకుంటుంది.. హాజరైతే వేదిక మీదనే రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. చివరకు అక్కడ రాజకీయ రచ్చ జరిగే అవకాశముంటుంది.. ఇలాంటి మాటలన్నీ జిల్లా పొలిటికల్ సర్కిళ్లలో వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రతీ కుటుంబానికి ఐదు లక్షల జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించే ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి సిద్దిపేట వేదికగా శ్రీకారం చుట్టనున్నందున పొలిటికల్‌గా బీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టాలన్నది సీఎం ఆలోచనగా కనిపిస్తున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>