Mobile Popup Ad
Mobile Popup Ad

కాజూ పకోడి అవుతున్న యాదాద్రి ప్రసాదం

కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ (Nalgonda) జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి గుడి(Yadadri Temple) లో ప్రసాదం పేరుతో జరుగుతున్న అక్రమాలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించే జీడిపప్పు, బాదం, నెయ్యి వంటి విలువైన సరుకులు స్వామివారికి నైవేద్యంగా చేరకుండా మధ్యలోనే మాయం అవుతున్నాయనే  ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. భక్తులు సమర్పించిన కానుకలతో ప్రసాదం తయారు చేయాల్సింది పోయి, కొంతమంది సిబ్బంది వాటిని వ్యక్తిగతంగా వినియోగిస్తున్నారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రసాదాల తయారీ కేంద్రంలో నిల్వల లెక్కలు, రికార్డులకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతోందనే అనుమానాలు బలపడుతున్నాయి. అవుట్‌సోర్సింగ్ సిబ్బంది చేతివాటానికి కొంతమంది అధికారుల మౌనం తోడవడంతో, స్వామివారి సంపద దొడ్డిదారిలో ఇళ్లకు చేరుతున్నట్లు సమాచారం.

ఇలాంటి ఘటనలు కొత్తవి కావు. గతంలో ప్రసాదాల తయారీలో వాడే చింతపండు బస్తాలు మాయం కావడం కలకలం రేపగా, ఇప్పుడు లడ్డూలకు వాడే బాదం, కాజు వంటి ఖరీదైన సరుకులు కూడా అదృశ్యమవుతున్నాయి. తాజాగా ప్రసాదాల తయారీ కేంద్రంలో మెటీరియల్ దొంగిలిస్తూ సిబ్బంది మీడియాకు పట్టుబడటం మరింత సంచలనంగా మారింది. అంతేకాదు, ఆ సరుకులతో పకోడీలు తయారు చేసుకుని అక్కడికక్కడే తినడం భక్తులను ఆగ్రహానికి గురిచేస్తోంది. మిగిలిన సరుకులను ప్యాకెట్లలో నింపి బయటకు తీసుకెళ్లే సమయంలో అడ్డంగా పట్టుబడ్డారు.

దేవస్థాన గోదాములు ప్రస్తుతం అక్రమాలకు నిలయాలుగా మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రసాదాల తయారీ కోసం కొనుగోలు చేసే బియ్యం, నూనె, జీడిపప్పు, బాదం వంటి సరుకులు గోదాములకు చేరినప్పటి నుంచే మాయమవుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగితాల్లో ఉన్న లెక్కలు, వాస్తవ నిల్వల మధ్య భారీ తేడాలు కనిపిస్తున్నాయి. స్టాక్ రిజిస్టర్లను సక్రమంగా తనిఖీ చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించడం ఈ అక్రమాలకు మరింత దారితీస్తోంది. ఈ వ్యవహారంలో అవుట్‌సోర్సింగ్ సిబ్బంది పాత్ర ఉన్నప్పటికీ, ఉన్నతాధికారుల అండ లేకుండా ఇంత పెద్ద స్థాయిలో అక్రమాలు జరగడం అసాధ్యమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గోదాముల వద్ద సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ, వాటి ఫుటేజీని సమీక్షించే వ్యవస్థ లేకపోవడం, గతంలో జరిగిన ఘటనలపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్ల అక్రమార్కులలో భయం తగ్గిపోయింది.

స్వామివారికి మహానైవేద్యంగా సమర్పించాల్సిన సరుకులను దొంగిలించడం కేవలం అపచారం మాత్రమే కాదు.. తీవ్రమైన నేరమని భక్తులు మండిపడుతున్నారు. వేల కోట్లతో అభివృద్ధి చేసిన ఈ పవిత్ర క్షేత్రంలో ఇలాంటి ఘటనలు ఆలయ (Yadadri Temple) ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, దేవస్థానం ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి గోదాముల్లో సమగ్ర తనిఖీలు చేపట్టాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రసాదం తయారీ విభాగంలో పారదర్శకత కోసం డిజిటల్ స్టాక్ మేనేజ్‌మెంట్ వ్యవస్థను అమలు చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

Read Also: గ్యాస్ లేకుండా వంట చేసుకోవచ్చు.. సరికొత్త స్టవ్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>