కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం ఐలాపూర్ (Ailapur) గ్రామంలో హైడ్రా (HYDRA) భారీ ఆపరేషన్ నిర్వహించిన విషయం తెలిసిందే. 15 వేల కోట్లకు పైగా విలువైన 861 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ సాగింది. రెవెన్యూ, మున్సిపల్‌శాఖల సమన్వయంతో హైడ్రా ఇక్కడ కూల్చివేతలు చేపట్టింది. రూ. వేల కోట్ల విలువైన భూములను హైడ్రా స్వాధీనం చేసుకున్నప్పటికీ స్థానికుల నుంచి వ్యతిరేకత రాకపోగా.. సంబురాలు జరిగాయి.
భారీ అపరేషన్ సాగిందిలా..
శనివారం ఉదయమే అమీన్‌పూర్‌కు పెద్దఎత్తున పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా (HYDRA), రెవెన్యూ, మున్సిపల్‌శాఖలతోపాటు ఇతర విభాగాలు రావడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన మొదలైంది. మూడేళ్ల క్రితం ఐలాపూర్‌లో నోటరీ పేరుతో ఉన్న నిర్మాణాలను భారీగా తొలగించారు. అయితే ముందుగానే ఇల్లు కట్టుకున్న పేదలు, సామాన్యులు ఆందోళన చెందాల్సిన పని లేదని… వారి జోలికి వెళ్లబోమని ఎప్పటికప్పుడు మైకులో అధికారులు ఎప్పటికప్పుడు మైకు ద్వారా ప్రకటించారు. దీంతో స్థానికుల నుంచి ఎలాంటి ఆందోళనలు, నిరసనలు హైడ్రాకు ఎదురుకాలేదు. ఐలాపూర్‌లో ఇప్పటికే ఇల్లు కట్టుకుని ఉన్న వారిని మినహాయించి మిగిలి ఉన్న ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. ఐలాపురంలోని భూముల విషయంలో యథాతథ స్థితిని కొనసాగించాలని 2013లో హైకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య 861 ఎకరాలకు హైడ్రా అధికారులు ఫెన్సింగ్ వేశారు. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల సమక్షంలో హైడ్రా యంత్రాంగం ఈ భారీ ఆపరేషన్ నిర్వహించింది.
న్యాయవాది ముఖీం ఫామ్‌హౌస్ నేలమట్టం
హైకోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా న్యాయవాది ముఖీం 40 ఎకరాల్లో నిర్మించిన ఫామ్‌హౌస్‌ను అధికారులు నేలమట్టం చేశారు. కోర్టు తీర్పులు పెండింగ్ ఉండగా ఆ భూమితో ఎలాంటి సంబంధం లేని ముఖీంతో పాటు అతని అనుచరులు ఇష్టానుసారం అమ్మకాలు చేస్తుండడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. కిష్టారెడ్డి పేట శివారులోని వివాదస్పద ఐలాపూర్ భూముల్లో 2.20 ఎకరాల్లో ముఖీం సోదరుడు ఎంఏ అజీం నిర్మించిన 6 అంతస్తుల 3 టవర్లను భారీ యంత్రాలతో తొలగించారు. ఐలాపూర్ లో మొత్తం 1263 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. ఇప్పటికే కొన్ని ఇళ్లు నిర్మాణం జరిగింది. పేదలు కట్టుకున్న ఇళ్లను మినహాయించి ఖాళీగా ఉన్న 860 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ రోజు ప్రభుత్వం కాపాడింది. భవిష్యత్తులో ప్రభుత్వ భూముల్లో కబ్జాలు చేయలనే ప్రయత్నం చేస్తే మరింత కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు చెబుతున్నారు.
Read Also: ‘మంత్రి సీతక్కపై అసత్య ప్రచారం’.. సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు!
Follow Us On: Facebook

