కలం, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందా? ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జోష్ మీద ఉన్న కాంగ్రెస్ పార్టీ.. మరో ఉప ఎన్నిక కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నదా? దానం వ్యాఖ్యల వెనుక మర్మం ఏమిటి? ఇప్పుడు ఇదే చర్చ రాష్ట్రంలో జరుగుతున్నది. తాజాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మీడియాతో (Danam Nagender) మాట్లాడుతూ.. ఎన్నికల్లో గెలిచి ఫైట్ చేయడం తనకు కొత్త కాదని వ్యాఖ్యానించారు. పోరాడి గెలవడం తన రక్తంలోనే ఉందని పేర్కొన్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం ఆదేశిస్తే తాను రాజీనామా చేస్తానని చెప్పారు. ‘నాకు ఎన్నికలు కొత్త కాదు. ఇప్పటికే 11 ఎన్నికల్లో కొట్లాడిన చరిత్ర ఉంది. అనర్హత కేసు విషయంలో సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి మరో పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగితే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది.’ అంటూ దానం వ్యాఖ్యనించారు. దీంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఖాయమన్న చర్చ నడుస్తోంది.
కాంగ్రెస్ వ్యూహం ఏమిటి?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. పోల్ మేనేజ్‌మెంట్‌లో పార్టీ సక్సెస్ అయ్యింది. అందరిని ఒక్కతాటి మీదకు తీసుకురావడంలో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సక్సెస్ అయ్యారు. ఇప్పుడు అదే వ్యూహాన్ని ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ అవలంభించే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌లో మరో నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే క్రమంగా కాంగ్రెస్ పార్టీ పట్టు పెరుగుతుంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో వ్యూహాత్మంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. దానం నాగేందర్ (Danam Nagender) బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. గత పార్లమెంటు ఎన్నికల్లో ఆయన సికింద్రాబాద్ ఎంపీగా కూడా పోటీ చేశారు. దీంతో సాంకేతికంగా ఆయన పార్టీ ఫిరాయించినట్టు ఆధారాలు ఉన్నాయి. అందుకే అనర్హత వేటు పడే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. దీంతో ఈ సెగ్మెంట్‌లో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. మరో ఫిరాయింపు ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా ఇదే ధోరణిలో మాట్లాడుతున్నారు. ఆ నియోజకవర్గంలోనూ ఉప ఎన్నిక వస్తుందా? అన్నది వేచి చూడాలి.
Read Also: ’హిల్ట్‘పై హైకోర్టు సంచలన నిర్ణయం
Follow Us On: X(Twitter)


