కలం, వెబ్ డెస్క్: పెళ్లి.. వ్యక్తి జీవితంలో ముఖ్యమైన ఘట్టం. వివాహం ఎలా జరిగినా దాని తరువాత జరిగే రిసెప్షన్ వేడుకలను ఘనంగా నిర్వహించుకోవాలని చాలామంది అనుకుంటారు. ఇలానే కర్ణాటకు చెందిన ఓ నవవధువుల రిసెప్షన్ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేశారు. ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్న రిసెప్షన్ వేడుకలకు ఇండిగో విమానాల(Indigo Flights) సంక్షోభం అడ్డంగా మారింది. ఫ్లైట్లు క్యాన్సల్ కావడంతో ఆ దంతులు ఆన్ లైన్ వేదికగానే రిసెప్షన్ ను కానిచ్చేశారు. ఈ అరుదైన ఘటన కర్ణాటకలో జరిగింది.
దేశంలో అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుండటంతో ప్రయాణికుల ఇబ్బందులు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా విమానాలు రద్దవుతుండటంతో అత్యవసర పనుల కోసం కూడా ప్రజలు ఒక నగరం నుంచి మరో నగరానికి చేరుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో కర్ణాటకలోని హుబ్బళ్లి నుంచి ఓ అరుదైన ఘటన బయటకు వచ్చింది. ఇండిగో విమానాలు రద్దవడంతో, ఒక కొత్త జంట తమ సొంత రిసెప్షన్ వేడుకకే ప్రత్యక్షంగా హాజరు కాలేక, ఆన్‌లైన్‌లోనే పాల్గొన్నారు.
హుబ్బళ్లికి చెందిన మేధా క్షీరసాగర్, భువనేశ్వర్‌కు చెందిన సంగం దాస్ అనే ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ఈ నెల 23న భువనేశ్వర్‌లో వీరి వివాహం జరిగింది. అటు తర్వాత, వధువు స్వగ్రామమైన హుబ్బళ్లిలో బుధవారం రిసెప్షన్‌ను గుజరాత్ భవన్‌లో జరగాల్సి ఉంది. దీని కోసం వాళ్లు డిసెంబర్ 2న భువనేశ్వర్ నుంచి బెంగళూరు, అక్కడి నుంచి హుబ్బళ్లికి వెళ్లేలా ఇండిగో విమాన టికెట్లు బుక్ చేసుకున్నారు.
కానీ, మంగళవారం ఉదయం 9 గంటల నుంచి బుధవారం ఉదయం వరకు వరుసగా ఫ్లైట్ లు లేట్ అయ్యాయి. చివరకు డిసెంబర్ 3న ఆ విమానం పూర్తిగా రద్దు కావడంతో దంపతులు హుబ్బళ్లికి చేరుకోలేకపోయారు. భువనేశ్వర్, ముంబై, హుబ్బళ్లి కి రావాల్సిన పలువురు బంధువుల విమానాలు కూడా ఇదే విధంగా రద్దయ్యాయి. కాగా, హుబ్బళ్లిలో రిసెప్షన్ కోసం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు.. అతిథులంతా చేరుకున్నారు. అయితే, నవవధువులు రాలేదు.. అయినా రిసెప్షన్ రద్దు చేయకుండా నవదంపతుల కోసం రిజర్వ్ చేసిన సీట్లలో వధువు తల్లిదండ్రులే కూర్చొని సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించారు.
అటు భువనేశ్వర్‌లో పెళ్లి దుస్తుల్లో రెడీగా ఉన్న మేధా క్షీరసాగర్, సంగం దాస్ ఆన్ లైన్ ద్వారా రిసెప్షన్ వేడుకల్లో పాల్గొన్నారు. అతిథులు కూడా వారిని పెద్ద ఎల్‌ఈడీ తెర మీద చూస్తూ ఆశీర్వదించారు. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. పైలట్ల కొరత, నిబంధనల కారణంగా ఇండిగో విమానాల(Indigo Flights) సర్వీసులను రద్దు చేస్తున్నదని మరోసారి స్పష్టమవుతోంది.
Read Also: రాష్ట్రంలో మరో ఉప ఎన్నిక తప్పదా?
Follow Us On: Pinterest


