కవిత వ్యాఖ్యలకు కేసీఆర్ రియాక్షన్‌పై ఉత్కంఠ

కలం, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ (Telangana Rashtra Sena) పేరుతో రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీని స్థాపించిన కల్వకుంట్ల కవిత (Kavitha) తన తండ్రి కేసీఆర్ (KCR) మీద ఘాటుగా ఫైర్ అయ్యారు. మనసు లేని మర మనిషి అని, మమకారం చంపుకున్నారని, తెలంగాణ ఆత్మ లేదని, గుంట నక్కల దగ్గర బందీ అయ్యారని.. ఇలాంటి అనేక కామెంట్లు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సహా పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో భారీ అవినీతి జరిగిందని, అడిగినందుకు తనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారని, అవినీతికి పాల్పడినవారిని మాత్రం తన పక్కనే పెట్టుకున్నారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున విస్తృత స్థాయి రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో స్పీచ్ సందర్భంగా ఈ కామెంట్లకు కేసీఆర్ కౌంటర్ ఇస్తారా?.. తేలిగ్గా తీసుకుని పక్కకు పెడతారా?.. సైలెంట్‌గా ఉంటే మరింత రెచ్చిపోతుందని తనదైన శైలిలో పరోక్షంగా సెటైర్లు వేస్తారా?.. ఇలాంటి సందేహాలు పార్టీ శ్రేణుల్లో నెలకొన్నాయి.

ఇప్పటివరకు కూతురిపై కామెంట్ చేయని కేసీఆర్ :

బీఆర్ఎస్ నుంచి కవితను సస్పెండ్ చేసినప్పటి నుంచి కేసీఆర్ ఎలాంటి కామెంట్లు చేయలేదు. సస్పన్షన్‌పైనా మౌనంగానే ఉన్నారు. కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినా పట్టించుకోలేదు. పార్టీ లీడర్లు సైతం రియాక్ట్ కాలేదు. చాలా రోజుల తర్వాత మీడియాతో జరిగిన చిట్‌చాట్ సందర్భంగా కవితను ఉద్దేశించి కేటీఆర్ మాత్రమే ఇన్‌డైరెక్ట్ కామెంట్లు చేశారు. ఇంతకాలం ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తిగా ఉన్నందున కవిత ఎన్ని ఆరోపణలు చేసినా బీఆర్ఎస్ లీడర్లు పట్టించుకోలేదు. ఇప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టడంతో అదే వైఖరి అవలంబిస్తారా?.. లేక సరైన సమయం చూసి కౌంటర్ ఇస్తారా?. అనే మాటలు కూడా శ్రేణుల్లో వినిపిస్తున్నాయి. కవితను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, ఆమెకు సమాధానం ఇవ్వడమంటేనే ఆమె ట్రాప్‌లోకి వెళ్ళినట్లవుతుందన్నది బీఆర్ఎస్ నేతల అభిప్రాయం. రెచ్చగొట్టే కామెంట్లు చేసినా పట్టించుకోవద్దనేది ఇప్పటివరకూ బీఆర్ఎస్ (BRS) అభిప్రాయం. ఇకపైన కూడా ఇదే వైఖరి కంటిన్యూ కావచ్చనే వాదనా వినిపిస్తున్నది.

ఉద్దేశపూర్వకంగా చేసే కామెంట్లకు స్పందించొద్దు :

పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురికావడాన్ని తట్టుకోలేక పదేపదే కవిత (Kavitha) విమర్శిస్తున్నారని, ఒకసారి స్పందిస్తే అది కంటిన్యూ అవుతూనే ఉంటుందని, సైలెంట్‌గా ఉండడమే ఉత్తమమన్నది బీఆర్ఎస్ అభిప్రాయం. పనిగట్టుకుని విమర్శిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతున్నందున పట్టించుకోవాల్సిన అవసరం లేదని, దీన్నే పార్టీ లీడర్లందరికీ పార్టీ నాయకత్వం మౌఖికంగా చెప్పింది. ఆమె కామెంట్లకు కౌంటర్ ఇవ్వాలని కొందరు గులాబీ నేతలు భావించినా కేసీఆర్ (KCR) కుమార్తె కావడంతో ఏం మాట్లాడితే ఎలాంటి చిక్కులొస్తాయోనని సైలెంట్‌గానే ఉండిపోయారు. కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విషయం కొన్ని రోజులు హల్‌చల్ చేయడంతో అప్పటి నుంచి ఏ గులాబీ నేత కూడా కవిత కామెంట్లకు రియాక్ట్ కావొద్దనే నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టిన తర్వాత కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నదే పార్టీ వైఖరి అని తెలిసింది.

Read Also: మళ్లీ పుట్టిన ‘టీఆర్ఎస్’.. పేరు, జెండా వెనుక కవిత స్ట్రాటజీ ఏంటి?

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>