Mobile Popup Ad
Mobile Popup Ad

రెండో ‘సారీ’.. ప్రజలకు ప్రధాని మోడీ…

కలం, నేషనల్ డెస్క్ : ప్రధాని మోడీ (PM Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) స్కెచ్ వేస్తే ఫెయిల్ అనేదే ఉండదు.. వారిద్దరి అంచనాలు తప్పనే తప్పవ్.. బీజేపీ లీడర్లకు, కేడర్‌కు వారిద్దరి పట్ల అంతటి ప్రగాఢ విశ్వాసం. అందుకే వీరిద్దరి జోడీని ‘మోడీ-షా’ అంటూ కామెంట్లు వచ్చినా పెద్దగా పట్టించుకోరు. కానీ ఆ ఇద్దరి అంచనాలు తప్పడంతో డ్యామేజ్ కంట్రోల్ కోసం ప్రధాని మోడీ ‘సారీ’ బాటను ఎంచుకోవడం కూడా అంతే ఆనవాయితీ. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోడీ తీసుకున్న నిర్ణయాలతో ప్రజలు పలు సందర్భాల్లో పడరాని బాధలు పడ్డారు. కుటుంబ సభ్యులు చెట్టుకొకరు పుట్టకొకరుగా విడిపోయారు. నోట్ల రద్దు, కరోనా లాక్‌డౌన్, జనతా కర్ఫ్యూ.. ఇలాంటి సందర్భాలను అప్పట్లో ప్రజలు గుర్తుచేసుకుని మోడీని శాపనార్ధాలు పెట్టారు. కానీ ఒక్కసారి కూడా ప్రజలకు సారీ చెప్పలేదు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మాటల మధ్యలో ‘ప్రజలను ఇబ్బంది పెట్టాను..’ అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు.

ఫస్ట్ టైమ్ మెట్టు దిగి రైతులకు మొదటి ‘సారీ’ :

వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 2020లో తెచ్చిన మూడు సాగు చట్టాలను (Agriculture Acts) రైతుల సంక్షేమం కోసమేనంటూ ప్రధాని మోడీ వివరణ ఇచ్చారు. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే సాగు చట్టాలు అంటూ రైతులు నిరసన తెలిపారు. పండించిన పంటలకు మార్కెట్ లేకుండా చేసి ప్రైవేటు వ్యాపారులకే అమ్ముకునే నిర్బంధ పరిస్థితులు ఏర్పడతాయని రైతులు ఆందోళన వ్యక్తంచేశారు. కేంద్ర ప్రభుత్వ తీరుకు, మూడు సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో 2020 నవంబరు 26 నుంచి దాదాపు ఏడాదికి పైగా నిరసనలు చేశారు. ఎక్కువగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ రైతులు నిరాహారదీక్షలు కూడా చేశారు. చివరకు మెట్టు దిగిన ప్రధాని మోడీ 2021 నవంబరు 19న గురునానక్ జయంతి సందర్భంగా టీవీ ఛానెళ్ల ద్వారా జాతిని ఉద్దేశించిన చేసిన ప్రసంగంలో మూడు సాగు చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో పాటు రైతాంగానికి ఫస్ట్ టైమ్ ‘క్షమాపణ’ చెప్పారు.

రెండో ‘సారీ’ మహిళలకు :

ప్రధాని మోడీ (PM Modi) పన్నెండేండ్ల పాలనలో రెండోసారి మహిళలకు క్షమాపణలు చెప్పారు. రాజ్యాంగ సవరణతో ముడిపడిన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందుతాయన్న ఉద్దేశంతో ప్రత్యేక పార్లమెంటరీ సమావేశాలు ఏర్పాటు చేసి వీటిపై చర్చ సందర్భంగా అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకున్నారు. మహిళా రిజర్వేషన్‌కు అన్ని పార్టీలు మద్దతు తెలిపినా డీలిమిటేషన్‌ ప్రయత్నాన్ని మాత్రం వ్యతిరేకించాయి. దీంతో రాజ్యాంగ సవరణ బిల్లు ఓడిపోయింది. చివరకు టీవీ ఛానెల్ ద్వారా ప్రధాని మోడీ ఏప్రిల్ 18న రాత్రి 8.30 గంటలకు జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మహిళలకు ‘క్షమాపణ’ చెప్పారు. ప్రధానిగా మోడీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ పుష్కర కాలంలో రెండో ‘సారీ’ చెప్పినట్లయింది. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్న విపక్షాలకు ఇకపైన ఎన్నికల్లో మహిళలే బుద్ధి చెప్తారని కామెంట్ చేశారు. “కేంద్రం పెట్టింది మహిళా బిల్లే కాదు.. ఆ పేరుతో డీలిమిటేషన్ బిల్లు” అంటూ విపక్షాలు కౌంటర్ ఇచ్చాయి.

Read Also: అనుకున్నదొక్కటి.. మోడీ ప్లాన్ ఢమాల్..

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>