ఆపరేషన్ ఆక్టోపస్ 2.0.. దేశ వ్యాప్తంగా 52 మంది అరెస్ట్!

క‌లం, వెబ్‌డెస్క్‌: హైద‌రాబాద్ పోలీసులు (Hyderabad Police) చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక్టోప‌స్ (Operation Octopus) 2.0 ద్వారా దేశ వ్యాప్తంగా జ‌రుగుతున్న భారీ సైబ‌ర్ మోసాల నెట్‌వ‌ర్క్ బ‌య‌ట‌ప‌డింది. పెట్టుబ‌డి స్కామ్‌లు, ట్రేడింగ్ మోసాలు, డిజిట‌ల్ అరెస్ట్‌ల పేరిట జ‌రుగుతున్న నేరాల‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు 14 స్పెష‌ల్ టీమ్స్ 9 రాష్ట్రాల్లో ఏకకాలంలో దాడులు నిర్వ‌హించాయి. ఈ ఆప‌రేష‌న్‌లో మొత్తం 52 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 32 మంది వివిధ ప్రైవేటు బ్యాంకుల‌కు చెందిన అధికారులు ఉండ‌టం పోలీసుల‌ను షాక్‌కు గురి చేసింది. నేర‌గాళ్ల‌తో కుమ్మ‌క్కైన ఈ అధికారులు నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా మ్యూల్ ఖాతాలు తెరిచి, దాదాపు రూ.150 కోట్ల మేర జ‌రిగిన 850 సైబ‌ర్ నేరాల‌కు స‌హ‌క‌రించిన‌ట్లు ద‌ర్యాప్తులో తేలింది.

ఈ దాడుల్లో మ‌హారాష్ట్ర‌, ఢిల్లీ, గుజ‌రాత్‌, క‌ర్ణాట‌క వంటి రాష్ట్రాల్లో ప‌లువురు నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి 26 మొబైల్ ఫోన్లు, 21షెల్ కంపెనీల స్టాంపులు, చెక్ బుక్స్‌, ల్యాప్‌ట్యాప్స్ స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఏయూ స్మాల్ ఫైనాన్స్‌, ఇండ‌స్ ఇండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ వంటి ప్ర‌ముఖ బ్యాంకుల్లో ప‌ని చేస్తున్న మేనేజ‌ర్లు, కేవైసీ అప్రూవ‌ర్లు, రిలేష‌న్‌షిప్ మేనేజ‌ర్లు నేర‌స్తుల‌కు స‌హ‌క‌రించిన‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ సైబ‌ర్ ముఠా సాధార‌ణ ప్ర‌జ‌ల అమాయ‌క‌త్వాన్ని ఆస‌రాగా చేసుకొని భారీగా సొమ్ము చేసుకుంటోంది. గతంలో జరిగిన ‘ఆపరేషన్ ఆక్టోపస్-1’ (Operation Octopus) ద్వారా లభించిన ఆధారాలతోనే ఈ రెండో విడత దాడులను పోలీసులు విజయవంతంగా పూర్తి చేశారు.

సైబ‌ర్ నేరాల ప‌ట్ల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, అధిక లాభాల ఆశ చూపే ప్ర‌క‌ట‌న‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని హైద‌రాబాద్ సీపీ సూచించారు. ఏ వ్య‌వ‌స్థ‌లోనూ డిజిట‌ల్ అరెస్ట్ చేసే నిబంధ‌న లేద‌ని, భ‌య‌ప‌డ‌కుండా వెంట‌నే 1930 నెంబ‌ర్‌కు ఫిర్యాదు చేయాల‌ని సూచించారు. ఎవ‌రైనా త‌మ వ్య‌క్తిగ‌త బ్యాంకు ఖాతాను ఇత‌రుల‌కు అక్ర‌మ లావాదేవీల‌కు ఇచ్చినా నేరంగానే ప‌రిగ‌ణిస్తామ‌ని హెచ్చ‌రించారు. అలాగే బ్యాంకులు కేవైసీ నిబంధ‌న‌ల‌ను క‌ఠినంగా అమ‌లు చేయాల‌ని, నిర్ల‌క్ష్యం వ‌హించే అధికారుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు. బాధితుల‌కు న్యాయం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా అంత‌ర్ రాష్ట్ర నెట్‌వ‌ర్క్‌లో మిగిలిన కీల‌క వ్య‌క్తుల కోసం ద‌ర్యాప్తు జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించారు.

Read Also: తెలంగాణ‌పై తేజ‌స్వీ వ్యాఖ్య‌లు.. కేంద్ర మంత్రి క్ష‌మాప‌ణ‌లు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>