కలం, నేషనల్ డెస్క్ : ప్రధాని మోడీ (PM Modi) ఆశలు ఆవిరయ్యాయి. ఆయన అనుకున్నదొకటైతే చివరకు జరిగింది మరొకటి. సెంటిమెంట్ కావడంతో తిరుగులేకుండా గెలుస్తామని పెట్టుకున్న ఆశలన్నీ పటాపంచలయ్యాయి. ఇలాంటి పరిణామం వస్తుందని ఆయన ముందుగా అంచనా వేసుకోలేకపోయారు. రాజ్యంగ సవరణతో డీలిమిటేషన్ (Delimitation) చేసి పెరిగిన సీట్లను మహిళలకు రిజర్వు చేద్దామని ఆశించి భంగపడ్డారు. మహిళా రిజర్వేషన్ (Women Reservation Bill) అంశాన్ని ప్రధానం చేసి దాని వెనక డీలిమిటేషన్ పథక రచన చేయడంతో విపక్షాలన్నీ ఏకమయ్యాయి. ప్రభుత్వ యాక్షన్ ప్లాన్ బెడిసికొట్టింది. ఈ బిల్లులకు లోక్‌సభలో ఆమోదం పొందగానే గ్రాండ్ సెలెబ్రేషన్స్ చేద్దామని బీజేపీ ఏర్పాట్లు చేసుకున్నది. కానీ ఫలితం మరోలా రావడంతో ఒక్కసారిగా బీజేపీ శ్రేణులు షాక్‌కు గురయ్యాయి. విధిలేని పరిస్థితుల్లో నిరసన ర్యాలీలుగా మారిపోయాయి.
ఎన్డీఏ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి మహిళలు :
రాజ్యాంగ సవరణ, దాని వెన్నంటి డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం ప్లాన్ చేసినప్పుడే పకడ్బందీ ఏర్పాట్లు మొదలయ్యాయి. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ముందే బీజేపీ పాలిత రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్ళాయి. ప్రతీ ఎన్డీఏ పాలిత రాష్ట్రం నుంచి కనీసంగా వెయ్యి మంది మహిళల చొప్పున ఆ మూడు రోజుల పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు తీసుకురావాల్సిందిగా ప్రణాళిక సిద్ధమైంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ మొదలు అన్ని ఎన్డీఏ పాలిత రాష్ట్రాల నుంచి వేలాది మంది మహిళలు ఢిల్లీ చేరుకున్నారు. వారికి అవసరమైన వసతి సౌకర్యాలు, పార్లమెంటులోకి ఎంటర్ కావడానికి అవసరమైన పాస్‌ల మంజూరు, ప్లాన్ ప్రకారం వారిని ఎలా ఆర్గనైజ్ చేయాలి.. ఇలాంటివన్నీ నిర్దిష్ట ప్లాన్ ప్రకారం పూర్తయ్యాయి.
ఆ రెండు రోజులు ఏం జరిగింది? :
మూడు బిల్లుల్లో మహిళా రిజర్వేషన్ బిల్లునే (Women Reservation Bill) కేంద్ర ప్రభుత్వం హైలైట్ చేయాలనుకున్నది. లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లు పాసైతే ఆటోమేటిక్‌గా మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ అయ్యేలా రూల్-66 ప్రకారం ఏర్పాట్లు జరిగాయి. కచ్చితంగా బిల్లు పాస్ అవుతుందనే ఉద్దేశంతో రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది మహిళలతో విజయోత్సవాలను పార్లమెంటు ఆవరణలోనే నిర్వహించాలన్నది బీజేపీ ప్లాన్. ఓటింగ్ తర్వాత పాస్ అయిన వెంటనే భారీ స్థాయిలో బాణసంచా పేల్చి ఒక్కసారిగా వేలాది మంది మహిళలు పార్లమెంటు ఆవరణలో నినాదాలతో సంబురాలు చేసుకునేలా ముందస్తు ప్రణాళిక ఖరారైంది. స్వీట్లు పంచిపెట్టుకోవడం, ప్రధాని మోడీని అభినందించడం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను సత్కరించడం.. ఇవన్నీ జరిగేలా సర్వ ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. కానీ చివరి నిమిషంలో బెడిసికొట్టింది.
ఎక్కడో తేడా కొడుతుందన్న అనుమానం :
మహిళా రిజర్వేషన్ బిల్లునే బీజేపీ హైలైట్ చేసింది. రాజ్యాంగ సవరణ బిల్లును దాని వెనక్కి నెట్టింది. చర్చల్లోనూ ఎక్కువగా మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, నాలుగు దశాబ్దాల వారి కల మరికొన్ని గంటల్లో సాకారమవుతున్నదని ప్రధాని మోడీ, అమిత్ షా వారి ఉపన్యాసాల్లో పేర్కొన్నారు. డీలిమిటేషన్‌తో దక్షిణాది, చిన్న రాష్ట్రాలకు జరిగే ప్రమాదాన్ని వివరించి కేంద్ర ప్రభుత్వ కుట్రను ఛేదించాలని విపక్షాలన్నీ ఏకాభిప్రాయానికి వచ్చాయి. రాహుల్‌గాంధీ ప్రసంగం టైమ్ షెడ్యూల్ ఫిక్స్ అయిన వెంటనే ఎక్కడో తేడా కొడుతుందని భావించిన ప్రధాని మోడీ విపక్ష పార్టీలకు, అందులోని మహిళా ఎంపీలకు ఎమోషనల్ అప్పీల్ చేశారు. మనోప్రబోధం ప్రకారం ఓటు వేయాలని, ఓటు వేసే ముందు తల్లిని, చెల్లిని, అక్కను, భార్యను గుర్తు చేసుకుని మహిళలకు జరిగే మేలు గురించి ఆలోచించాలని కోరారు.
విజయోత్సవ ర్యాలీకి బదులుగా నిరసనలు :
ఒకవైపు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రెజిజు విపక్ష పార్టీల నేతలతో వరుస సంప్రదింపులు మొదలుపెట్టారు. మహిళా రిజర్వేషన్ ఈ దేశ రాజకీయ వ్యవస్థలోనే ఒక మైలురాయి వంటిదని వివరించి ఓటింగ్‌లో సహకరించాలని కోరారు. మరోవైపు ప్రధాని మోడీ విపక్షాలకు ట్విట్టర్ ద్వారా భావోద్వేగమైన విజ్ఞప్తి చేశారు. కానీ ఇవేవీ పనిచేయలేదు. లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ లేదని తెలిసినా విపక్షాల్లోని మహిళలంతా సెంటిమెంట్‌తో కలిసొస్తారని భావించారు. కానీ అక్కడే బీజేపీ అంచనా తప్పింది. ప్రధాని, అమిత్ షా ఇచ్చిన వివరణతో విపక్షాలు సంతృప్తి చెందలేదు. చివరకు ఓటింగ్ టైమ్ రానే వచ్చింది. మూడింట రెండొంతుల మెజారిటీపై ఆశలు పెట్టుకున్న ప్రధాని మోడీ, అమిత్ షా సహా కేంద్ర మంత్రులందరికీ ఊహించని దెబ్బ తగిలింది. ఎమోషన్స్, సెంటిమెంట్స్ వర్కవుట్ కాలేదని అర్థమైంది. కేంద్రం పెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు ఓడిపోయింది. స్వీట్లు పంచుకుని నినాదాలతో విజయోత్సవాలు చేసుకోవాలనే ప్లాన్ రివర్స్ అయింది. ఎన్డీఏ మహిళా ఎంపీలతో నిరసన ర్యాలీ జరిగింది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మహిళలంతా ఎక్కడివారక్కడ సర్దుకున్నారు.
Read Also: బెంగాల్‌లో 58 లక్షల ఓట్లు డిలిట్.. ఎన్నికల అధికారి వివరణ
Follow Us On: X(Twitter)

