కలం డెస్క్: రాష్ట్రంలో పలువురు మంత్రులపై (Telangana Ministers) గత కొంతకాలంగా వరుస ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారి చుట్టూ వివాదాలు ముసురుకుంటున్నాయి. ఎలాంటి సంబంధమూ లేదని సదరు మంత్రులు ఖండిస్తున్నారు. భావోద్వేగానికి గురవుతున్నారు. కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కానీ, తోటి మంత్రులు మాత్రం సైలెంటుగానే ఉంటున్నారు. చివరకు పార్టీ పెద్దలు, ప్రభుత్వ పెద్ద నుంచి మద్దతు, సానుభూతి దక్కడంలేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ మౌనం వెనుక మర్మమేంటి? వ్యూహాత్మకమా?.. వారి వ్యక్తిగతమనే భావనా?.. స్పందిస్తే ఒక బాధ.. స్పందించకపోతే మరో ఆందోళనా?.. మంత్రులపై వస్తున్న ఆరోపణలు అటు ప్రభుత్వానికి, ఇటు పార్టీకి నెగెటివ్ అవుతున్నాయి. ముఖ్యమంత్రి మొదలు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, పీసీసీ చీఫ్, జిల్లా ఇన్‌చార్జి మంత్రులు డ్యామేజ్ కంట్రోల్ చర్యలు చేపట్టకపోవడంతో మరో రకమైన చర్చకు ఆస్కారమిచ్చినట్లయింది.
‘విషమిచ్చి చంపేయండి’ అంటూ విలపించినా..!
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలువురు మంత్రులపై ఆరోపణలు వస్తున్నాయి. మంత్రుల మధ్య సమన్వయం లేదని, కొందరు మినిస్టర్లు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ సోషల్ మీడియాలో కామెంట్లు జోరుగానే సాగుతున్నాయి. ఆ మధ్య పొన్నం ప్రభాకర్‌పై, తాజాగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియా ముందుకొచ్చి.. ‘‘నా కొడుకు చనిపోయినప్పుడే నేను సగం చచ్చిపోయాను.. నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టాలనుకుంటే ఒకేసారి ఇంత విషమిచ్చి చంపేయండి. మంత్రులు, మహిళా ఐఏఎస్‌ల మీద అభియోగాలు కరెక్ట్ కాదు” అని ఆవేదన వెలిబుచ్చారు. తప్పుడు కథనాలను ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్ల సంఘాలు ఖండించాయి. మంత్రి కోమటిరెడ్డికి తోటి మంత్రుల నుంచి, పార్టీ పెద్దల నుంచి మద్దతు లభించలేదు.
సందేహాలకు తావిచ్చిన మౌనం :
కేబినెట్ మినిస్టర్‌పై టీవీ ఛానెళ్ళలో, సోషల్ మీడియాలో వచ్చిన వార్తలపై సదరు మంత్రి కంటతడి పెట్టుకున్నా సహచర మంత్రుల నుంచి స్పందన రాకపోవడమే జిల్లా స్థాయిలో చర్చనీయాంశమైంది. “బాధలో ఉన్న మంత్రుల్ని పలకరించలేదు… వారిపై వచ్చిన ఆరోపణలను ఖండించలేదు.. కనీసం స్టేట్‌మెంట్లు కూడా ఇవ్వలేదు…” అని పార్టీ కేడర్‌లో చర్చ జరుగుతున్నది. మంత్రుల విషయంలోనే పార్టీ పెద్దలు సైలెంట్‌గా ఉంటే మిగతా వాళ్లకు ఇబ్బందులు వచ్చినా అంతేనా?.. అనే ఆందోళన వ్యక్తమవుతున్నది. బాధిత నేతలను పిలిపించుకోవడమో లేక వారి దగ్గరికే వెళ్లి మాట్లాడడమో చేయకుండా మౌనంగా ఉండటంలో ఆంతర్యంపైనే ఇప్పుడు సందేహాలు నెలకొన్నాయి. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సీఎంఓలో ఓ మహిళ హల్‌చల్ అంటూ మీడియాలో తప్పుడు వార్తలు వచ్చినప్పుడూ మంత్రులు పెదవి విప్పలేదని గుర్తుచేసుకుంటున్నరు. ఆరోపణలు రావడం ఒక ఎత్తయితే, డ్యామేజ్ కంట్రోల్ చర్యలు లేకపోవడం అనేక అర్థాలకు దారితీస్తున్నదనేది కేడర్ భావన.
కాగల కార్యం.. చందంగా… :
మంత్రులపై (Telangana Ministers) వచ్చే ఆరోపణలు వారి వ్యక్తగతం అనే భావనతో పెద్దలు సైలెంట్‌గా ఉంటున్నారా?.. నెగెటివ్‌ను చక్కదిద్దుకునే బాధ్యత వారిదేనని భావిస్తున్నారా?.. మౌనంగా ఉంటే అదే సర్దుకుపోతుందనుకుంటున్నారా?.. పార్టీకి, ప్రభుత్వానికి ఏం సంబంధం అని వదిలేస్తున్నారా?.. ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తే మంత్రులుగా వారే స్వచ్ఛందంగా తప్పుకుంటారని ఆలోచిస్తున్నారా?.. ఇలాంటి అనేక రకాల చర్చలు కేడర్‌లోనే కాక ప్రజల్లోనూ చోటుచేసుకుంటున్నాయి. సమంత విషయంలో మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ప్రభుత్వానికి సంబంధం లేదనే ధోరణే కొనసాగింది. లీగల్ మార్గాన్ని ఎంచుకున్నారు. చివరికి డిప్యూటీ సీఎం చొరవతో ఆమె బేషరతు క్షమాపణలు చెప్పి ఫుల్ స్టాప్ పెట్టారు. తాజాగా వివాదాల్లో చిక్కుకున్న మంత్రులకు ఎలాంటి ఫినిషింగ్ టచ్ వస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also: రేవంత్ నిజాయితీ గల మోసగాడు : కేటీఆర్
Follow Us On : WhatsApp


