కలం, వెబ్ డెస్క్ : సాధారణంగా మనిషి బతికున్నంత కాలం ఆస్తులు కూడబెట్టుకోవాలని, మేడలు కట్టాలని ఆరాటపడతాడు. కానీ జగిత్యాల (Jagtial) జిల్లాకు చెందిన ఒక వ్యక్తి మాత్రం, తన మరణం తన బిడ్డలకు కష్టం కాకూడదని ఆలోచించాడు. తాను చనిపోయిన తర్వాత తన పిల్లలు రూపాయి ఖర్చు పెట్టకూడదని, ఎవరినీ చేయి చాచకూడదని భావించి 15 ఏళ్ల క్రితమే తన సమాధిని తానే నిర్మించుకున్నాడు. ఆ విలక్షణ వ్యక్తి నక్క ఇందయ్య అలియాస్ జాన్ కన్నుమూశారు.
జగిత్యాల (Jagtial) రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన ఇందయ్య ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళారు. అక్కడ కష్టపడి సంపాదించిన డబ్బుతో గ్రామానికి తిరిగి వచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేశారు. తన ఊరి బాగు కోసం తన వంతు సాయం అందిస్తూ అందరికీ ఆప్తబంధువు అయ్యారు.
రేపు తన పిల్లలకు అంత్యక్రియల భారం ఉండకూడదన్న ఉద్దేశంతో, 2009లోనే తన సొంత భూమిలో సుమారు 8 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఒక సమాధిని నిర్మించుకున్నారు. చనిపోయాక తనని ఎక్కడ ఉంచాలో, ఎలా ఉంచాలో తనే ముందే నిర్ణయించుకుని, ఆ నిశ్చింతతోనే ఇన్నేళ్లు జీవించారు.
కొద్దిరోజులుగా అనారోగ్యంతో ఉన్న ఇందయ్య, కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మరణించారు. ఆయన మరణంతో గ్రామంలో విషాదం నిండినప్పటికీ, ఆయన తీసుకున్న నిర్ణయం అందరినీ కదిలించింది. తండ్రి చివరి కోరిక మేరకు, ఆయన 15 ఏళ్ల క్రితం సిద్ధం చేసుకున్న ఆ సమాధిలోనే కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించి ఆయనకు వీడ్కోలు పలికారు.
Read Also: పురపోరులో రెబల్స్ బెడద.. ప్రధాన పార్టీల్లో టెన్షన్..!
Follow Us On : WhatsApp


