జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గంలో తెలుగుదేశం(TDP) సానుభూతిపరుల ఓట్లు ఏ పార్టీకి పడబోతున్నాయి? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మాగంటి గోపీనాథ్ గతంలో తెలుగుదేశం పార్టీనుంచే వచ్చిన నేతే. ఆయన భార్య బరిలో ఉంది కాబట్టి ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి వెళతాయా? ఇక స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీ నేతే. కాబట్టి ఆయన ఈ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు కాబట్టి తెలుగు తమ్ముళ్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తారా? ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేశారు? ప్రస్తుతం బీజేపీ, టీడీపీ మధ్య అధికారికంగా పొత్తు కూడా ఉంది. కాబట్టి బీజేపీకి వెళ్తాయా? ఇప్పుడు ఈ ప్రశ్న అందరి మదిలోనూ మెదులుతోంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, సానుభూతిపరులు గణనీయంగా ఉన్నారు. దీంతో వాళ్ల ఓట్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఎన్టీఆర్ విగ్రహప్రతిష్ఠ ప్రకటన అందుకేనా?
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ సభలో మాట్లాడుతూ.. మైత్రివనంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని నెలకొల్పుతామని ప్రకటించారు. కేవలం తెలుగుదేశం పార్టీ(TDP) ఓటర్లను ఆకర్షించేప్రయత్నంలో భాగంగానే ఆయన ఈ ప్రకటన చేసినట్టు తెలిసింది. అంతేకాకుండా ఆయన గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన అనుభవంతో ఆ పార్టీ నేతలతో నిత్యం టచ్ లో ఉంటున్నట్టు సమాచారం. తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తమకే పడేలా చూసుకుంటున్నారు.
బీఆర్ఎస్ నమ్మకం ఏమిటి?
దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గతంలో తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా వ్యవహరించారు. కాబట్టి ఆయన వెంట వచ్చే క్యాడర్ మొత్తం తమకే అనుకూలంగా ఉంటుందన్న బీఆర్ఎస్ ఆశపడుతోంది. అంతేకాకుండా తాము అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణికి టికెట్ ఇచ్చాము కాబట్టి తెలుగుదేశం ఓట్లు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే ఓ కీలక సామాజికవర్గం ఓట్లు తమకే పడతాయని బీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటున్నది. కాంగ్రెస్ పార్టీ బీసీ నేతకు స్థానికుడికి టికెట్ ఇచ్చింది కాబట్టి.. సెటిలర్ల ఓట్లు తమకే పడతాయన్నది బీఆర్ఎస్ ఆశ.
పొత్తు లెక్కలు పనిచేస్తాయా?
అయితే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ఏపీలో అధికారంలో ఉంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలోనూ తమ మద్దతు బీజేపీకేనని టీడీపీ ప్రకటించింది. అయితే క్షేత్రస్థాయిలే ఈ ప్రకటన ఎంతమేరకు ఆచరణలో ఉంటుందో వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ ఫైట్ నడుస్తోంది కాబట్టి. తెలుగుదేశం సానుభూతిపరులు ఈ రెండు పార్టీల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకొనే అవకాశం ఉందిన. బీజేపీ బరిలో ఉన్నప్పటికీ ఈ నియోజకవర్గంలో గట్టి పోటీ ఇవ్వలేకపోతున్నది. కాబట్టి పొత్తు లెక్కలు ఎంతవరకు పనిచేస్తాయో వేచి చూడాలి. మొత్తంగా ఈ నియోజకవర్గంలో టీడీపీ సానుభూతిపరుల ఓటు బ్యాంక్ కీలకంగా మారింది.
Read Also: ఓ పార్టీ 2 వేలు.. ఇంకోపార్టీ 3 వేలు?
Follow Us on: Instagram

