జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉపఎన్నికను కాంగ్రెస్, బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టకుండా ప్రతి ఓటును ఎంతో కీలకంగా భావిస్తున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం ఏరులై పారుతుందని ముందునుంచే అంతా భావించారు. అందులో భాగంగా డబ్బు పంపిణీ అప్పుడే ప్రారంభమైందని వార్తలు వస్తున్నాయి. కొన్ని బస్తీలను కేంద్రంగా చేసుకొని రాజకీయపార్టీలు డబ్బుల పంపిణీనికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంత తొందరగా డబ్బులు పంపిణీ చేస్తే పోలింగ్ తేదీనాటికి ఓటర్లు గుర్తించుకుంటారా? అన్న ఓ ప్రశ్న కూడా ఉంది. ఇప్పుడు ఓటుకు 2 వేలు ఇచ్చి.. పోలింగ్ తేదీ నాటికి మరో 3 వేలు ఇచ్చేలా ప్రణాళికలు రచించినట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా ఈ ఎన్నిక చాలా కాస్ట్లీగా మారిపోయింది.
డబ్బుదే ప్రధాన పాత్ర
జూబ్లీహిల్స్(Jubilee Hills) నియోజకవర్గంలో బస్తీలు అత్యంత కీలకపాత్ర పోషిస్తాయి. దాంతోపాటు మైనార్టీల ఓట్లు కూడా కీలకమే. అయితే నిరుపేద వర్గాలను డబ్బు ద్వారా ఆకర్షించవచ్చని ప్రధాన రాజకీయపార్టీలు ప్రణాళికలు రచించినట్టు తెలుస్తోంది. యూసుఫ్‌గూడ పరిధిలోని కొన్ని బస్తీల్లో డబ్బు పంపిణీ ప్రారంభమైనట్టు తెలిసింది. వాట్సాప్ గ్రూపులు, గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇలాంటి ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లను గుర్తించడం కష్టమవుతుండటంతో అధికారులకు సవాలుగా మారింది. ఎన్నికల నియమావళి ప్రకారం ఓటర్లకు నగదు, బహుమతులు లేదా ఇతర ప్రలోభాలు ఇవ్వడం నేరం. ఈ నేపథ్యంలో ఎన్నికల అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, విజిలెన్స్ బృందాలు అలర్ట్ అయ్యాయి. బ్యాంక్ లావాదేవీలను కూడా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇటీవల బీఆర్ఎస్ నేతల ఇండ్లల్లో పోలీసులు తనిఖీలు చేసిన విషయం తెలిసిందే.
ప్రజాస్వామ్య వ్యవస్థను నిలబెట్టాలంటే ఓటర్లు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని అధికారులు, సామాజిక సంస్థలు పిలుపునిస్తున్నారు. పార్టీలు ఎంత డబ్బు పంచినా, ఓటు హక్కును చిత్తశుద్ధితో వినియోగించాలని అవగాహన కల్పిస్తున్నారు. మరి ఓటర్లు డబ్బులు తీసుకొని ఏ పార్టీకి ఓటు వేస్తారు? అన్నది కూడా ప్రతిష్ఠాత్మకంగా మారింది. గతంలోనూ ఉపఎన్నిక సమయంలో ఈ పరిస్థితి కనిపించింది. మునుగోడు, హుజూరాబాద్ వంటి నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు వచ్చినప్పుడు డబ్బు పంపిణీ విచ్చలవిడిగా సాగింది. ఓ పార్టీ ఓటుకు రెండు వేలు ఇస్తుండగా మరోపార్టీ ఓటుకు మూడు వేలదాకా ఇస్తున్నట్టు తెలుస్తోంది.
Read Also: రియాజ్ కుటుంబానికి న్యాయం జరగాలి: సోషల్ యాక్టివిస్ట్
Follow Us on: Instagram

