epaper
Saturday, January 24, 2026
spot_img
epaper

ధరణి అక్రమార్కులను వదిలి పెట్టం: మంత్రి పొంగులేటి

కలం, వెబ్​ డెస్క్​ : ధరణి పోర్టల్ లోని లొసుగులను అడ్డుపెట్టుకొని ప్రభుత్వ భూములను కొల్లగొట్టిన వారిని, రిజిస్ట్రేషన్ల సొమ్మును దారి మళ్లించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti) స్పష్టం చేశారు. శనివారం సచివాలయంలో ధరణి అక్రమాలపై ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీతో ఆయన సమావేశమయ్యారు.

గత ప్రభుత్వం ఎలాంటి ముందుచూపు లేకుండా, ఒక కుట్రపూరిత ఆలోచనతో ధరణి పోర్టల్‌ను (Dharani Portal) తీసుకువచ్చిందని మంత్రి విమర్శించారు. ఈ పోర్టల్‌ను ఆసరాగా చేసుకుని గత ప్రభుత్వంలోని పెద్దలు ప్రభుత్వ భూములను కాజేశారని ఆయన మండిపడ్డారు. సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో కేంద్ర ప్రభుత్వ అనుబంధ సంస్థతో నిర్వహించిన పైలట్ ఫోరెన్సిక్ ఆడిట్‌లో అనేక అవినీతి అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. ఈ నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత, రాష్ట్రంలోని మిగిలిన 31 జిల్లాల్లో కూడా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.

ధరణి ప్రారంభమైనప్పటి నుంచి జరిగిన 35 వేల లావాదేవీలలో 4,848 లావాదేవీల్లో లోటుపాట్లు ఉన్నట్లు కమిటీ గుర్తించిందని మంత్రి తెలిపారు. ఇందులో 1,109 డాక్యుమెంట్లకు సంబంధించి సుమారు నాలుగు కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి చెల్లింపులు జరగలేదని వివరించారు. ఈ అక్రమాలకు సంబంధించి ఇప్పటికే 9 జిల్లాల్లోని 35 మండలాల్లో 48 మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. విచారణలో ఎవరి పాత్ర ఎంత ఉంది, తెరవెనుక ఎవరున్నారు, అధికారుల హస్తం ఉందా అనే కోణంలో లోతైన విచారణ జరిపి తుది నివేదిక ఇవ్వాలని కమిటీని ఆదేశించారు.

ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శలపైనా మంత్రి పొంగులేటి (Ponguleti) స్పందించారు. వాస్తవాలు ఇలా ఉంటే, కొందరు వెయ్యి కోట్లు, మరికొందరు పదివేల కోట్ల అవినీతి అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. సర్వే వ్యవస్థ బలోపేతం గురించి మాట్లాడుతూ, ఇప్పటికే 4,000 మందికి లైసెన్స్‌లు ఇచ్చామని, ఆదివారం ఖమ్మం (Khammam) జిల్లాలో మరో 2,000 మందికి లైసెన్స్‌లు అందజేస్తామని చెప్పారు. వీరితో రాష్ట్రంలో నక్షా లేని 373 గ్రామాల్లో రీ-సర్వే నిర్వహిస్తామని మంత్రి పొంగులేటి వివరించారు. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు, ఇంటెలిజెన్స్ అదనపు డిజి విజయ్‌కుమార్ తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Read Also: సింగరేణిపై కట్టుకథల విషపు రాతలు : భట్టి విక్రమార్క

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>