కలం, వరంగల్ బ్యూరో : వరంగల్ (Warangal ) పోలీస్ కమిషనర్ పై ఉమ్మడి జిల్లా నేతలు యుద్ధం ప్రకటించారు. అధికారుల పోస్టింగ్‌లు, వివిధ కేసుల్లో అధికార పార్టీ నేతలు చేస్తున్న సిఫారసులను ఆయన తిరస్కరించడమే ప్రధాన కారణమనే ప్రచారం ఉంది. లీడర్లు ఏరికోరి ఎంపిక చేసుకున్న సీఐలను సీపీ తిరస్కరించడం, వేరే జిల్లాకు చెందిన ఓ నేత చెప్పిన మాటలను సీపీ తు.చ. తప్పకుండా పాటించండం లాంటి ఘటనలు లోకల్ లీడర్ల కు ఆగ్రహం తెప్పించింది. దీంతో ఇటీవలె జిల్లా ఇంచార్జ్ మంత్రికి కమిషనరేట్ లో ఉన్న ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు స్పందించిన ఆయన సమస్యను ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకెళ్లి తగు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు సమాచారం.
ఆయన రూటే వేరు?
వరంగల్ పోలీస్ కమిషనర్ (Warangal CP) సన్ ప్రీత్ సింగ్ రూటే సపరేట్ అన్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఓరుగల్లు అధికార పార్టీ నేతలు ఆయనపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. నేతల సిఫారసులను పెండింగ్ లో పెట్టడం, కొన్నింటిని తిరస్కరిస్తుండటంతో ఓరుగల్లు అధికార పార్టీ నేతలు సీపీ తీరుపై అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. సన్ ప్రీత్ సింగ్ వరంగల్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించి ఏడాది అవుతుంది. గత ఏడాది మార్చిలో ఆయన వరంగల్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి కూడా స్థానిక రాజకీయ నాయకులు-సీపీకి పొసకడం లేదనే వాదనలున్నాయి. పైకి మంచిగా ఉన్నట్టు కనిపిస్తూనే లోలోపల చేసేది చేసుకుపోతున్నారట. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఓ మంత్రి చెప్పిన మాటలను కూడా పెడచెవిన పెడుతున్నట్లు వినికిడి.
మంత్రి మాటలు భేఖాతర్
జిల్లాకు చెందిన ఓ మంత్రి, వారి అనుచరులకు సీపీకి అస్సలు గిట్టడం లేదన్న ప్రచారం జరుగుతోంది. గతంలో ఆ మంత్రి సిఫారసు మేరకు పోస్టింగ్ లు పొందిన ఓ ఏసీపీ, పలువురు సీఐలను సీపీ సన్ ప్రీత్ సింగ్ (Sunpreet Singh) సస్పెండ్ చేశారు. దానికి తోడు ఆ మంత్రి అనుచరులపై కూడా కేసులు నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ మంత్రి సీపీపై గుర్రుగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దీనికితోడు పలువురు ఎమ్మెల్యేల కేసుల విషయంలో చేసిన సిఫారసులు, సీఐ, ఎస్ఐ పోస్టింగ్ ల కోసం జారీ చేసిన లేఖలను కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది . ఈ నేపథ్యంలో సీపీ సన్ ప్రీత్ సింగ్ ను మార్చాలని ఓరుగల్లు నేతలంతా ఒక్కటిగా జతకట్టినట్లు సమాచారం. ఇటీవల వరంగల్ పర్యటనకు వచ్చిన జిల్లా ఇంచార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎదుట నేతలు మొరపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మంత్రి సహా ఈ సీపీ వద్దని జిల్లా ఇంచార్జ్ మంత్రికి చెప్పుకున్నట్లు సమాచారం. మంత్రి పొంగులేటి కూడా సానుకూలంగా స్పందించడంతో పాటు ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిసింది.
అన్ని వర్గాల్లో అసంతృప్తి
సీపీ వ్యవహారశైలిపై కేవలం నేతల్లోనే కాకుండా అటు సొంత శాఖలోనూ, పబ్లిక్ లోనూ అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇటీవల వరంగల్ నగరంలోని ఓ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఓ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లపై గంజాయి బ్యాచ్ దాడికి దిగింది. దీనిపై చర్యలు తీసుకోకపోగా.. ఎలాంటి దాడులు జరగలేదని, అదంతా మీడియా సృష్టే అని సీపీ సన్ ప్రీత్ సింగ్ విలేకరుల సమావేశంలో చెప్పడం విమర్శలకు తావిచ్చింది. అలాగే ఐనవోలు మండలం పున్నేలులో ఆడపిల్లలు పుడుతున్నారని… ఓ వ్యక్తి భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేయడం, అంతకుముందే భార్యకు రెండు అబార్షన్లు చేయడంలాంటి కేసుల్లోనూ పోలీసుల దర్యాప్తుపై విమర్శలు వచ్చాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న డాక్టర్లను మీడియా ముందు తీసుకురాకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అలాగే భూపాలపల్లి జిల్లాలో పని చేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్ ను మరో కానిస్టేబుల్ లైంగికంగా వేధించడంతో ఆమె వరంగల్ (Warangal) నగరంలో ఆత్మహత్య చేసుకుంది.
ఈ కేసులో ఇప్పటి వరకు వేధింపులకు గురిచేసిన కానిస్టేబుల్ ను అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. అంతేగాకుండా వరంగల్ ట్రై సిటీలో కొద్ధి రోజులుగా చైన్ స్నాచర్లు వరుస చోరీలకు పాల్పడుతున్నారు. కానీ కేసుల పరిష్కారం, నేరాలను అరికట్టడంలో పోలీసుల తీరుపై బాధితులు గుర్రుగా ఉన్నారు. మొత్తంగా సీపీ సన్ ప్రీత్ సింగ్ పై అటు లీడర్లే కాదు ఇటు సామాన్యులు సైతం అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పెద్దలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Read Also: భోజ్‌శాల మసీద్ కాంప్లెక్స్ కాదు.. హిందూ ఆలయమే: మధ్యప్రదేశ్ హైకోర్టు
Follow Us On: Sharechat

